“కొడుకును స్కూల్‌లో వదిలి ఊరికి బయలుదేరిన తండ్రి.” దారిలోనే వచ్చిన షాకింగ్ ఫోన్ కాల్! 12 ఏళ్ల బాలుడికి ఏమైంది..? మిస్టరీగా మారిన మృతి.!!!

మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొడుకును స్కూల్ హాస్టల్‌లో వదిలి సొంతూరికి బయలుదేరిన ఒక తండ్రికి, దారిలో ఉండగానే తన కుమారుడు మృతి చెందాడనే పిడుగుల్లాంటి వార్త తెలిసింది.

చంద్రపూర్ సమీపంలోని ప్రైవేట్ సన్మిత్ర సైనిక్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న జీవన్ విలాస్ జరేకర్ (12) అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రాజురా తాలూకాలోని ఖంబాడా గ్రామానికి చెందిన ఈ బాలుడు ఈ విద్యా సంవత్సరంలోనే ఆ పాఠశాలలో చేరి హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గురువారం బాలుడికి చర్మ సంబంధిత సమస్య రావడంతో, తండ్రి అతడిని చంద్రపూర్ నగరంలోని ఒక చర్మవ్యాధి నిపుణుడి (Dermatologist) వద్దకు తీసుకెళ్లాడు. ఆసుపత్రిలో చూపించిన అనంతరం, కొడుకును తిరిగి స్కూల్‌లో దింపి ఆయన తన ఊరికి పయనమయ్యాడు. తండ్రి దారిలో ఉండగా.. స్కూల్ నుండి ఒక ఉపాధ్యాయుడు ఫోన్ చేసి, వెంటనే స్కూల్‌కు రావాలని చెప్పాడు. కంగారుపడిన తండ్రి వెనక్కి స్కూల్ వైపు వెళ్తుండగా మళ్లీ ఫోన్ వచ్చింది. ఆ కాల్‌లో తన కొడుకు చనిపోయాడని చెప్పడంతో ఆ తండ్రి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.

ఘటన తర్వాత బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. హాస్టల్‌లో ఉండటం ఆ బాలుడికి ఇష్టం లేదని, కొంత ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో మిగతా విద్యార్థులంతా మైదానంలో ఆడుకుంటుండగా, జీవన్ తన గదిలోకి వెళ్లినట్లు సమాచారం. అక్కడే అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, మృతికి గల అసలు కారణం ఇంకా నిర్ధారించబడలేదని పోలీసులు తెలిపారు.

తమ కుమారుడి మరణంపై పాఠశాల యాజమాన్యం, అధికారుల నుంచి సరైన వివరణ రాలేదని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పిల్లల భద్రత పట్ల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యపు తీరుపై తండ్రి పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో, ఘటన జరిగిన తీరు, హాస్టల్‌లో విద్యార్థుల భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పూర్తిస్థాయి దర్యాప్తు పూర్తయిన తర్వాతే బాలుడి మరణం వెనుక ఉన్న కచ్చితమైన కారణాలు వెల్లడికానున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *