దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (USC) పరిశోధకులు నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకునే యువకులలో (ధూమపానం చేయని వారు) ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తేలింది.
అయితే, ఇక్కడ దోషి పండ్లు లేదా కూరగాయలు కాదని, సాధారణ పద్ధతుల్లో పండించే పంటలపై వాడే పురుగుమందుల అవశేషాలే (Residual Pesticides) దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
అధ్యయన వివరాలు: అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ 2026 వార్షిక సమావేశంలో ఈ అధ్యయనాన్ని సమర్పించారు. 50 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సులో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన 187 మంది రోగుల ఆహారపు అలవాట్లు, ధూమపానం మరియు ఇతర వివరాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు.
‘హెల్తీ ఈటింగ్ ఇండెక్స్’ (Healthy Eating Index) ప్రకారం.. ఈ రోగుల ఆహార నాణ్యత సగటు అమెరికన్ కంటే చాలా మెరుగ్గా (65 స్కోరు) ఉంది. వీరు ఆకుకూరలు, చిక్కుళ్లు మరియు తృణధాన్యాలను సాధారణ ప్రజలకంటే ఎక్కువగా తీసుకున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ స్కోరు చాలా ఎక్కువగా ఉంది.
నిపుణుల అభిప్రాయం: “పాడి ఉత్పత్తులు, మాంసం లేదా ప్రాసెస్ చేసిన ఆహారంతో పోలిస్తే.. వాణిజ్యపరంగా పండించే (నాన్-ఆర్గానిక్) పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది” అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ జార్జ్ నీవా పేర్కొన్నారు. పురుగుమందులకు ఎక్కువగా గురయ్యే వ్యవసాయ కార్మికులలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రేటు ఎక్కువగా ఉందని ఆయన గుర్తుచేశారు.
ధూమపానం చేయని 50 ఏళ్ల లోపు వారు, ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతున్న పురుగుమందులే ఒక కారణం కావచ్చని ఈ డేటా సూచిస్తోంది. గతంలో వాయు కాలుష్యం మరియు హార్మోన్లను దెబ్బతీసే రసాయనాల వల్ల క్యాన్సర్ వస్తుందని భావించేవారు, ఇప్పుడు ఆహారం కూడా ఆ జాబితాలో చేరింది.
అయితే, ఈ సర్వేలో పాల్గొన్న వారు స్వచ్ఛందంగా వివరాలు అందించారని, దీనివల్ల ఫలితాల్లో చిన్నపాటి మార్పులు ఉండవచ్చని డాక్టర్ నీవా స్పష్టం చేశారు. మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరగడానికి గల కారణాలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
