కోమాలో ఉన్న వ్యక్తి తండ్రి కాగలడా? మెడికల్ సైన్స్ అద్భుతం.. వీర్యం అసలు ఎలా సేకరిస్తారు? ఖర్చు ఎంత? ఢిల్లీ హైకోర్టు తీర్పుతో వెలుగులోకి..

న్యూఢిల్లీ: వైద్య శాస్త్రం నేడు అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళినప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయినా, అతని శరీరంలో జీవకణాలను సజీవంగా ఉంచే అద్భుత సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పు, ఒక మహిళకు తల్లి కావాలనే ఆశను చిగురింపజేయడమే కాకుండా, కోమాలో ఉన్న వారి నుంచి కూడా వీర్యకణాలను (Sperm) సేకరించవచ్చనే విషయాన్ని చర్చనీయాంశం చేసింది.

కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఏంటి?

భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక జవాను గత కొంతకాలంగా కోమాలో ఉన్నారు. తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, భర్త వీర్యకణాలను భద్రపరచాలని అతని భార్య కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్.. భార్యాభర్తలు ఇదివరకే ఐవీఎఫ్ (IVF) ద్వారా సంతానం కోసం ప్రయత్నిస్తున్నందున, భర్త రాతపూర్వక అంగీకారం లేకపోయినా ఆమె హక్కును కాదనలేమని స్పష్టం చేశారు. ‘అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్-2021’ ప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందని తీర్పునిచ్చారు.

అసలు ఈ ‘సర్జికల్ స్పెర్మ్ రిట్రీవల్’ (SSR) అంటే ఏంటి?

ఒక పురుషుడు కోమాలో ఉన్నప్పుడు సహజ సిద్ధంగా వీర్యాన్ని ఇచ్చే స్థితిలో ఉండడు. అప్పుడు యూరాలజిస్టులు (మూత్రపిండ నిపుణులు) శస్త్రచికిత్స ద్వారా నేరుగా పునరుత్పత్తి అవయవాల నుండి వీర్యకణాలను సేకరిస్తారు. దీనినే ‘సర్జికల్ స్పెర్మ్ రిట్రీవల్’ అంటారు. ఇందులో ప్రధానంగా రెండు పద్ధతులు ఉంటాయి:

  1. PESA (పెర్క్యుటేనియస్ ఎపిడిడైమల్ స్పెర్మ్ ఆస్పిరేషన్): ఒక సన్నని సూది ద్వారా ‘ఎపిడిడైమిస్’ (అండకోశం పైభాగంలోని నాళం) నుండి వీర్యకణాలను బయటకు తీస్తారు.
  2. TESA (టెస్టిక్యులర్ స్పెర్మ్ ఆస్పిరేషన్): ఈ పద్ధతిలో నేరుగా అండకోశం కణజాలం (Tissues) నుండి సూది ద్వారా కణాలను సేకరిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను పేషెంట్‌కు నొప్పి తెలియకుండా ఎనస్థీషియా ఇచ్చి చేస్తారు.

సమయం చాలా కీలకం!

కోమా లేదా బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్నవారి నుంచి వీర్యకణాల సేకరించడంలో సమయం చాలా ముఖ్యం. వైద్యుల ప్రకారం.. ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిన లేదా మరణించిన (ప్రత్యేక పరిస్థితుల్లో) 48 నుండి 72 గంటల లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. సమయం పెరిగేకొద్దీ కణాల కదలిక (Motility) తగ్గి, అవి జీవించే అవకాశం క్షీణిస్తుంది.

ఎలా భద్రపరుస్తారు? (క్రయోప్రిజర్వేషన్)

సేకరించిన వీర్యకణాలను వెంటనే వాడాల్సిన అవసరం లేదు. వీటిని ‘నైట్రోజన్ ట్యాంకుల’లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టిస్తారు (Freeze). దీనిని ‘క్రయోప్రిజర్వేషన్’ అంటారు. ఈ పద్ధతి ద్వారా ఆ కణాలను కొన్ని దశాబ్దాల పాటు భద్రపరచవచ్చు. భార్య ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు వీటిని కరిగించి (Thawing), ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ఉపయోగిస్తారు.

ఖర్చు ఎంత అవుతుంది?

భారతదేశంలో ఈ ప్రక్రియకు అయ్యే ఖర్చు ఆసుపత్రి మరియు వాడే టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది:

  • PESA లేదా TESA: ఈ ప్రాథమిక పద్ధతులకు సుమారు రూ. 25,000 నుండి రూ. 50,000 వరకు ఖర్చవుతుంది.
  • Micro-TESE: ఒకవేళ మైక్రోస్కోప్ ఉపయోగించి చేసే అధునాతన పద్ధతి అయితే రూ. 1.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు.
  • మెట్రో నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఈ ఖర్చు ఇంకా పెరగొచ్చు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవి చౌకగా లభించినప్పటికీ, అక్కడ ఈ వసతుల లభ్యత తక్కువగా ఉంటుంది.

Posted

in

by

Tags: