విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల పట్టణంలో గురువారం మధ్యాహ్నం మానవత్వాన్ని మంటగలిపే అత్యంత విచారకరమైన ఘటన జరిగింది. నీళ్లు అడిగే నెపంతో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి, 32 ఏళ్ల మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ఆ మృగాడు ఆమె గుప్తంగంలోకి ఇనుప రాడ్‌ను దించి, తీవ్రంగా కొట్టి హింసించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఒక ప్రభుత్వ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తన భర్త నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. గత ఏడాది ఆమె సత్తెనపల్లి నుండి మాచర్లకు మకాం మార్చారు. ఆమెతో పాటు ఆమె మేనల్లుడు ఉండేవారు, కానీ పదో తరగతి పరీక్షల తర్వాత అతను సత్తెనపల్లిలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు.
గురువారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఒక గుర్తుతెలియని వ్యక్తి తలుపు తట్టి తాగడానికి నీళ్లు అడిగాడు. బాధితురాలు మానవత్వంతో నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయగా.. నిందితుడు బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, ఓణీతో చేతులు, కాళ్లు కట్టేసి, కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
గుప్తంగంలోకి ఇనుప రాడ్: ఆ మృగాడి క్రూరత్వం అంతటితో ఆగలేదు. ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి తనకు ఒక అంటువ్యాధి ఉందని బాధితురాలు మొరపెట్టుకున్నా వినలేదు. ఆమె మర్మాంగంలోకి ఇనుప రాడ్‌ను దించడంతో తీవ్ర రక్తస్రావమైంది. అయినప్పటికీ అతను ఆమెను హింసిస్తూనే ఉన్నాడు.
ఘటన వెలుగులోకి వచ్చిందిలా? బాధితురాలి మేనల్లుడు ఆమెకు పదే పదే ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో, అనుమానం వచ్చి బంధువులకు సమాచారం అందించాడు. బంధువులు ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె స్పృహతప్పి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను వెంటనే గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
