క్రికెట్ ఎన్నో విచిత్రమైన సంఘటనలను మనం చూస్తుంటాం. అయితే, బౌలర్ వేసిన బంతికి బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయినప్పటికీ, అంపైర్ మాత్రం ‘నాటౌట్’ అని ప్రకటించిన ఒక ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలు ఏం జరిగింది?
ఐక్యమ్య అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరుగుతున్న వన్డే త్రైపాక్షిక టోర్నమెంట్లో భాగంగా అఫ్ఘానిస్థాన్, జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనే ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.
జింబాబ్వే ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ బౌలింగ్ వేశారు. అఫ్ఘానిస్థాన్ పేస్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ప్రమాదకరమైన బంతి జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ బ్యాట్‌ను బీట్ చేసి నేరుగా స్టంప్స్‌ను తాకింది. బెన్నెట్ బౌల్డ్ కావడంతో అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు ఆనందంలో తేలియాడుతూ సంబరాలు చేసుకున్నారు.
నిబంధన ప్రకారం దక్కిన ఊరట
అయితే, క్రీజులో ఉన్న బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ వెంటనే అంపైర్‌కు ఒక ఫిర్యాదు చేశాడు. బౌలర్ ఒమర్జాయ్ బౌలింగ్ చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలో, అతని నడుముకు కట్టుకున్న టవల్ (తుండు) కింద పడిపోయింది. ఆ టవల్ కింద పడటం వల్లే తన ఏకాగ్రత దెబ్బతిందని బెన్నెట్ అంపైర్‌కు వివరించాడు.
వెంటనే తోటి అంపైర్లతో చర్చించిన ఆన్-ఫీల్డ్ అంపైర్, బెన్నెట్ వాదనను అంగీకరించి ఆ బంతిని ‘డెడ్ బాల్’గా ప్రకటించారు. ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం.. బౌలర్ శరీర భాగం లేదా అతను ధరించిన ఏ వస్తువైనా బౌలింగ్ చేసేటప్పుడు పడిపోతే, ఆ బంతిని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. దీంతో ఔట్ కావాల్సిన బెన్నెట్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం చూసి అఫ్ఘానిస్థాన్ ఆటగాళ్లు షాకయ్యారు.
తొందరగానే పెవిలియన్‌కు చేరిన బెన్నెట్
అయినప్పటికీ, అంపైర్ ఇచ్చిన ఈ అదృష్టం బెన్నెట్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. కొద్దిసేపు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన అతను 31 పరుగులు మాత్రమే చేసి, అల్లా మహ్మద్ గజన్ఫర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ (LBW) రూపంలో వెనుదిరిగారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు, ఓపెనర్ సెదిఖుల్లా అటల్ అద్భుతమైన సెంచరీ (102 పరుగులు) సహాయంతో 294 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే జట్టు అఫ్ఘాన్ బౌలింగ్‌ను ఎదుర్కొలేకపోయింది. స్పిన్ దిగ్గజం రషీద్ ఖాన్ కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో జింబాబ్వే జట్టు 38.4 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. చివరికి అఫ్ఘానిస్థాన్ జట్టు 158 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుత శతకం సాధించిన సెదిఖుల్లా అటల్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.

Leave a Reply