మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఒక యువకుడు తన ప్రాణ స్నేహితుడిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడిని క్షుద్రపూజలతో భయపెట్టి, బలవంతంగా జెండర్ మార్పిడి చేయించి, అనంతరం అత్యాచారానికి పాల్పడినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏం జరిగింది? నిందితుడు శుభం యాదవ్ (నర్మదాపురం నివాసి), బాధితుడికి ప్రాణ స్నేహితుడు. క్షుద్రవిద్యల ప్రభావంతో బాధితుడికి మత్తుమందులు ఇచ్చి, లింగమార్పిడి చేయించుకునేలా బలవంతం చేశాడు. ఆ తర్వాత 18 రోజుల పాటు అతడిని కత్తితో బెదిరించి బంధించి, లైంగికంగా వేధించాడు. నర్మదాపురంలోని ఒక హోటల్లో కూడా అతడిని బంధించి మత్తుమందులు ఇచ్చి అకృత్యాలకు పాల్పడ్డాడు.
పేరు మార్చి, గుర్తింపు చెరిపేసి.. బాధితుడికి ‘ట్వింకిల్’ అని పేరు పెట్టి, అదే పేరుతో నకిలీ ఐడీలు, మెడికల్ సర్టిఫికెట్లు కూడా తయారు చేయించాడు. దీనివల్ల బాధితుడి అసలు గుర్తింపు లేకుండా చేయాలని నిందితుడు ప్లాన్ చేశాడు. ఎవరికైనా చెబితే సమాజంలో పరువు తీస్తానని, బతకనివ్వనని బాధితుడిని నిరంతరం బెదిరించాడు.
బలవంతపు జెండర్ మార్పిడి: నిందితుడు బాధితుడిని ఇండోర్‌కు తీసుకెళ్లి బలవంతంగా జెండర్ మార్పిడి ఆపరేషన్ చేయించాడు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు కూడా ఏమీ తెలియకుండా, తనకు యాక్సిడెంట్ జరిగిందని అబద్ధం చెప్పాలని బాధితుడిని హెచ్చరించాడు. దీనివల్ల భయపడిన బాధితుడు దాదాపు 6 నెలల పాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయాడు.
పోలీసుల చర్య: నిందితుడి వేధింపులు భరించలేక, బాధితుడు భోపాల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఘటన జరిగిన ప్రాంతం నర్మదాపురం కావడంతో, ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి, కేసును నర్మదాపురం కొత్వాలీ పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
