ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా ఘటంపూర్ ఎస్డీఎం నివాసంలో చోటుచేసుకున్నట్లుగా చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించి తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రజా రక్షణ కోసం ధరించే గౌరవప్రదమైన ఖాకీ దుస్తులు ఇలా ఉన్నతాధికారుల సేవలకు, వ్యక్తిగత మసాజ్‌లకు వాడుకుంటున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఒక హోంగార్డు బనియన్, నిక్కరుతో మంచంపై పడుకుని ఉండగా, యూనిఫాంలో ఉన్న మరో తోటి హోంగార్డు అతడి కాళ్లను ఒత్తుతూ మసాజ్ చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను విస్మయానికి గురిచేశాయి.
మసాజ్ చేయించుకుంటున్న వ్యక్తి సదరు ఎస్డీఎం వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న మనోజ్ కుమార్ అని, కాళ్లు పిసుకుతున్న తోటి సిబ్బంది పేరు రజత్ అని సమాచారం.
“దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా అధికారుల పంచన ఇలాంటి బానిస బతుకులు మారవా?” అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం రచ్చకెక్కడంతో కాన్పూర్ పోలీసులు స్పందిస్తూ.. “వీడియోలో ఉన్న ఇద్దరూ హోంగార్డులుగా గుర్తించాం. ఈ ఘటనపై జిల్లా హోంగార్డు కమాండెంట్ విచారణ జరుపుతున్నారు. పూర్తి నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
