ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లాలో, ఎలాంటి గుర్తింపు లేని ఓ నకిలీ ఆసుపత్రిలో చేసిన తప్పుడు అబార్షన్కా రణంగా ఒక బాలిక గర్భాశయం, పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బస్తీ జిల్లాకు చెందిన ఆ పాఠశాల విద్యార్థిని గర్భం దాల్చిన విషయాన్ని దాచిపెట్టేందుకు, కుటుంబ సభ్యులు ఆమెను ‘పరమ్ హాస్పిటల్’ పేరుతో అనుమతి లేకుండా నడుస్తున్న నకిలీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కే.పీ. మిశ్రా అనే నకిలీ వైద్యుడు సరైన వైద్య పరిజ్ఞానం లేకుండా చేసిన ప్రమాదకరమైన వైద్యం వల్ల బాలిక గర్భాశయం పగిలిపోవడమే కాకుండా, ఆమె పేగులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అబార్షన్ సమయంలో విపరీతమైన రక్తస్రావం జరిగి బాలిక ప్రాణాలు ప్రమాదకర స్థితికి చేరుకోవడంతో, తల్లిదండ్రులు ఆమెను మొదట బస్తీలోని ఆసుపత్రికి, ఆపై గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ఐసీయూలో చేర్చుకున్న వైద్యులు వెంటనే అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆమె ప్రాణాలను కాపాడారు.
అయితే, పేగులు తీవ్రంగా దెబ్బతినడంతో వాటిలోని కొంత భాగాన్ని తొలగించక తప్పని పరిస్థితి వైద్యులకు ఏర్పడింది. ప్రస్తుతం కూడా బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించగా, ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆ నకిలీ ఆసుపత్రికి సీల్ వేశారు.
అంతేకాకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి నకిలీ వైద్యులు, ఆసుపత్రులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రధాన వైద్యాధికారి రాజీవ్ నిగమ్ హెచ్చరించారు. బాలిక పూర్తిగా కోలుకున్న తర్వాత తాము కూడా కఠిన చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Leave a Reply