స్కాల్డ్లాండ్: గర్భిణీ అయిన తన భార్యను 50 అడుగుల ఎత్తైన కొండపై నుండి తోసేసి చంపేసిన ఒక కర్కశ భర్తకు స్కాట్లాండ్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చనిపోయే ముందు ఆ భార్య పలికిన చివరి మాటలే ఈ కిరాతక భర్తను పట్టించాయి.
అసలేం జరిగింది? స్కాల్డ్లాండ్లోని ఎడిన్బర్గ్లో ‘ఆర్థర్ సీట్’ అనే కొండలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అయితే, కాశిఫ్ అన్వర్ అనే వ్యక్తి తన 17 వారాల గర్భిణీ భార్య ఫౌజియా జావేద్‌ను ఈ ప్రదేశానికి తీసుకువెళ్లి, సూర్యాస్తమయం చూపిస్తానని నమ్మించి కొండపైకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను అవమానించి, గొడవపడి, ఆపై 50 అడుగుల లోతులోకి తోసేశాడు. తన భార్యను వదిలించుకున్నానని భావించిన ఆ భర్త, తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని అనుకున్నాడు.
దంపతుల నేపథ్యం: ఫౌజియా ఒక లాయర్. అన్వర్‌ను ఒక కళ్లద్దాల దుకాణంలో కలిసిన తర్వాత వారి మధ్య పరిచయం పెరిగి, 2020 డిసెంబర్ 25న వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే అన్వర్ తన అసలు స్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. తనతో కలిసి ఉండటం ఇష్టం లేని ఫౌజియా, విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే, అదే సమయంలో ఆమె గర్భం దాల్చడంతో పరిస్థితి మారింది.
కొండ మీద దారుణం: సెప్టెంబర్ 1, 2021న సెలవుల కోసం ఎడిన్బర్గ్ వెళ్ళిన దంపతుల మధ్య గొడవలు కొనసాగాయి. అక్కడ కూడా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, తిరిగి వెళ్ళాక విడిపోవాలని ఫౌజియా నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని అన్వర్‌కు చెప్పగా, అతడు ఆగ్రహంతో ఆమెను కొండపై నుండి తోసేశాడు. ఫౌజియా సుమారు 15 మీటర్ల లోతులో ఉన్న రాళ్ల మధ్య ఇరుక్కుపోయింది.
చనిపోయే ముందు ఆమె ఇచ్చిన సాక్ష్యం: అక్కడ కొండలను సందర్శిస్తున్న దానియా రఫీక్ అనే వ్యక్తి ఫౌజియాను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ సమయంలో ఫౌజియా స్పృహలోనే ఉంది. “నా భర్తను నా దగ్గరకు రానివ్వకండి, అతడే నన్ను తోసేశాడు” అని ఆమె మొరపెట్టుకుంది. తన కడుపులో ఉన్న బిడ్డకు ఏమీ కాకూడదని ఆమె తపనపడింది. అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులతో కూడా ఫౌజియా తన భర్త చేసిన దారుణాన్ని వివరించింది. అంబులెన్స్ వచ్చేలోపే ఫౌజియా అక్కడికక్కడే గుండెపోటుతో మరణించింది.
కోర్టులో అన్వర్ నాటకం: నిందితుడు అన్వర్ కోర్టులో తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేస్తూ, అది ప్రమాదవశాత్తు జరిగిందని, సెల్ఫీ తీసుకుంటుండగా తన భార్యపై పడ్డానని అబద్ధాలు చెప్పాడు. కానీ, సాక్షులు, పోలీసులు మరియు ఫౌజియా చివరిగా చెప్పిన వాంగ్మూలం ఆధారంగా, నేరం నిరూపితమైంది. కోర్టు అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది.
