గల్ఫ్ ప్రాంతం మరియు దాని పరిసరాల్లోని అంతర్జాతీయ సముద్ర రవాణా మార్గాలలో వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, భారతీయ నావికుల ప్రాణాలను రక్షించడానికి, దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటానికి భారత ప్రభుత్వం పలు కీలక రక్షణ చర్యలను చేపట్టింది.
కేంద్ర నౌకాయానం, రేవులు, జలమార్గాల మంత్రిత్వ శాఖతో పాటు షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ (DGS) సంయుక్తంగా హార్ముజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ వంటి తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల్లోని పరిస్థితులను 24 గంటల పాటు నిశితంగా గమనిస్తున్నాయి.
గత జూన్ 10వ తేదీన ఒమన్లోని సోహార్ నగరానికి ఈశాన్యంగా 20 నాటికల్ మైళ్ల దూరంలో లోతైన సముద్రంలో ప్రయాణిస్తున్న పలావు (Palau) దేశపు జెండాతో ఉన్న ‘ఎమ్.టి. సెట్టబెల్లో’ (MT Settabello) అనే మధ్యస్థ శ్రేణి చమురు రవాణా నౌకపై అకస్మాత్తుగా క్షిపణి దాడి జరిగింది. ఈ నౌకలో 24 మంది భారతీయులతో సహా మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ ఘోర దాడిలో ప్రారంభంలో గల్లంతైనట్లు ప్రకటించిన ముగ్గురు భారతీయ నావికులు దురదృష్టవశాత్తూ మరణించారని, వారి మృతదేహాలు లభ్యమవడంతో ప్రస్తుతం అధికారికంగా ధృవీకరించారు. ఓడలో ఉన్న మిగిలిన సిబ్బందిని సురక్షితంగా రక్షించారు.
కేంద్ర మంత్రి సంతాపం – తక్షణ సాయం:
ఈ ఘోర ప్రమాదంపై కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మరణించిన వారి మృతదేహాలను పూర్తి గౌరవప్రదంగా స్వదేశానికి తీసుకురావాలని, సురక్షితంగా బయటపడిన మిగిలిన నావికులను వీలైనంత త్వరగా భారత్కు రప్పించాలని అధికారులను ఆదేశించారు.
బాధిత నావికుల కుటుంబాలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ఆయన.. ప్రాథమిక నిబంధనల ప్రకారం ‘సీఫేరర్స్ వెల్ఫేర్ ఫండ్ సొసైటీ’ ద్వారా మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల తక్షణ ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
నావికులకు హై అలర్ట్:
గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ (Geopolitical) ఉద్రిక్తతలు, వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు ప్రపంచ ఇంధన భద్రతకు పెద్ద ముప్పుగా మారాయి. ఈ నేపథ్యంలో, ఘర్షణలు జరుగుతున్న సముద్ర మార్గాల గుండా ప్రయాణించే భారతీయ మరియు విదేశీ జెండాలు కలిగిన ఓడల్లో పనిచేస్తున్న భారతీయ నావికులందరూ అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ సూచించింది.
షిప్పింగ్ కంపెనీలు, మేనేజర్లు అంతర్జాతీయ సముద్ర భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నావికులు మరియు వారి కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి 24 గంటలూ పనిచేసే అత్యవసర సమాచార కేంద్రాలను (Emergency Communication Centres) ఏర్పాటు చేశారు.
ఇవే అత్యవసర సహాయ కేంద్రం వివరాలు (Emergency Help Desk):
ఏదైనా అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం నావికులు, వారి కుటుంబ సభ్యులు క్రింది అధికారిక మార్గాల ద్వారా సంప్రదించవచ్చు:
ఈమెయిల్: dgcommcentre-dgs@nic.in / enavik.24×7@gov.in
వాట్సాప్ / కాల్ నంబర్: +91 8657549760 / +91 8655856830
ప్రత్యామ్నాయ నంబర్లు: +91 2222613606, +91 8657549752
టోల్-ఫ్రీ నంబర్ (దేశీయ): 1800-889-7768
అంతర్జాతీయ టోల్-ఫ్రీ నంబర్: +1-888-988-0256

Leave a Reply