అమెరికాలోని జార్జియా రాష్ట్రం రాక్మార్ట్ ప్రాంతంలో, తప్పిపోయిన ఒకరి కోసం గాలిస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఫామ్‌హౌస్‌లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పోలీస్ అధికారి.. అక్కడ ఎంతో గారాబంగా పెంచుకుంటున్న ‘హీ-హావ్’ అనే చిన్న గాడిద పిల్లను తుపాకీతో కాల్చి చంపిన ఘటన తీవ్ర ఆగ్రహావేశాలను, విషాదాన్ని నింపింది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆ పోలీస్ అధికారిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేశారు.
గత ఆదివారం అర్ధరాత్రి సుమారు 12:45 గంటల సమయంలో, ఎల్స్బెర్రీ ఫామ్‌కు చెందిన గడ్డి మైదానంలోకి (పాశ్చర్ ల్యాండ్) పోలీస్ అధికారులు ప్రవేశించారు. ఫామ్ యజమాని హన్నా ఇజ్రాయెల్ మాట్లాడుతూ.. అధికారులు తమ కుటుంబానికి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అనుమతి కూడా తీసుకోకుండా లోపలికి చొరబడ్డారని ఆరోపించారు.
అర్ధరాత్రి వేళ ఫామ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతుండటం గమనించిన ‘హీ-హావ్’ అనే చిన్న మగ గాడిద అరుచుకుంటూ బయటకు వచ్చింది. ఆ సమయంలో అక్కడున్న ఒక పోలీస్ అధికారి.. ఆ మూగజీవాన్ని చూసి తనకు ప్రమాదం పొంచి ఉందని భావించి, భయాందోళనతో తుపాకీతో కాల్చి చంపేశాడు. తప్పిపోయిన వ్యక్తిని వెతికే రెస్క్యూ ఆపరేషన్‌గా మొదలైన ఈ ఉదంతం, ఆ కుటుంబానికి తీరని శోకాన్ని, గుండెలు పగిలే నష్టాన్ని మిగిల్చింది. ‘హీ-హావ్’ అనేది ఏదో రోడ్డున తిరిగే జంతువు కాదని, ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు ప్రాణి అని తెలిపారు. తమ ముద్దుల ప్రాణికి జరిగిన ఈ అన్యాయంపై న్యాయం పోరాటం చేస్తానని హన్నా ఇజ్రాయెల్ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో, ఈ ఘటనపై న్యాయపోరాటం చేసేందుకు హన్నా ఇజ్రాయెల్ ప్రారంభించిన ఆన్లైన్ క్రౌడ్‌ఫండింగ్ (విరాళాల సేకరణ) అతి తక్కువ సమయంలోనే 35,000 డాలర్ల మార్కును దాటినట్లు ‘ది గార్డియన్’ వార్తా సంస్థ వెల్లడించింది.
మరోవైపు పోలీసుల కథనం ప్రకారం.. గాడిదను కాల్చిచంపిన ఫామ్‌కు సమీపంలోని చర్చి వద్దే తప్పిపోయిన బాలుడిని గుర్తించినట్లు తెలిసింది. పెంపుడు గాడిదను కాల్చి చంపిన ఘటనపై జార్జియా రాష్ట్ర వ్యవసాయ శాఖ ముమ్మర దర్యాప్తు ప్రారంభించింది.

Leave a Reply