గల్వాన్ ఘర్షణ జరిగిన 7 రోజులకే చైనా అణు పరీక్ష.. 6 ఏళ్ల తర్వాత అమెరికా ఈ విషయాన్ని ఎందుకు బయటపెట్టింది?

భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో, గల్వాన్ ఘర్షణపై అమెరికా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గల్వాన్ ఘర్షణ జరిగిన కేవలం 7 రోజులకే చైనా అణు పరీక్ష నిర్వహించిందని అమెరికా 6 ఏళ్ల తర్వాత ఎందుకు వెల్లడించింది?

2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైనా ఉద్దేశాలు సరిగ్గా లేవని అమెరికా అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ థామస్ డినానో ఆరోపించారు. అంతర్జాతీయ సంస్థల కళ్లుగప్పి చైనా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించిందనడానికి తమ వద్ద నిఘా సమాచారం ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

అమెరికా ఇప్పుడు ఎందుకు వెల్లడించింది? భారత్-చైనా సంబంధాలు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న సమయంలో అమెరికా ఈ విషయాన్ని బయటపెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా ప్రకారం.. చైనా జూన్ 22, 2020న జింజియాంగ్ ప్రాంతంలోని లోప్ నూర్ వద్ద ఈ పరీక్ష నిర్వహించింది. భూమి కంపించే సంకేతాలు బయటకు తెలియకుండా ఉండేందుకు చైనా ‘డీకప్లింగ్’ (Decoupling) అనే రహస్య సాంకేతికతను ఉపయోగించిందని డినానో తెలిపారు.

వేగంగా మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు: ఇటీవలే భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సంబంధాలు కొత్త స్థాయికి చేరుకుంటున్నాయని తెలిపారు. గల్వాన్ వివాదం తర్వాత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన కీలక భేటీ అనంతరం డైరెక్ట్ విమాన సర్వీసులు, కైలాస మానస సరోవర యాత్ర తిరిగి ప్రారంభమయ్యాయి. అలాగే చైనా పౌరులకు భారత్ టూరిస్ట్ వీసాలను కూడా పునరుద్ధరించింది.

అణు ఒప్పందంలో చైనాను చేర్చాలనుకుంటున్న ట్రంప్: ప్రపంచ రాజకీయాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. భారత్ ప్రపంచ వాణిజ్యానికి కేంద్రబిందువుగా మారుతోంది. ఈ క్రమంలో అమెరికా కూడా భారత్‌పై విధించిన 50% పన్నును 18%కి తగ్గించింది. మరోవైపు, అమెరికా-రష్యాల మధ్య ఉన్న అణు ఆయుధాల ఒప్పందం ఫిబ్రవరి 5తో ముగిసింది. భవిష్యత్తులో జరిగే ఏ అణు ఒప్పందంలోనైనా చైనాను కూడా భాగస్వామిని చేయాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా రహస్య అణు పరీక్షల అంశాన్ని అమెరికా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.


Posted

in

by

Tags: