“గుండెలవిసేలా రోదించిన తల్లి! నా కొడుకును నాకు తిరిగివ్వండి…!” 17 ఏళ్ల ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తల్లిదండ్రులు… క్యాంటీన్‌లో తిన్న ఆ ఒక్క కట్లెట్! తల్లి లేవనెత్తిన ప్రశ్న… బట్టబయలైన సీసీటీవీ దృశ్యాలు!

జైపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న ప్రిన్స్ సోనీ (17) అనే విద్యార్థి, ఉదయం ఎంతో ఉల్లాసంగా, ఆరోగ్యంగా పాఠశాలకు వెళ్లాడు.

అయితే లంచ్ బ్రేక్ సమయంలో స్కూల్ క్యాంటీన్‌లో కొన్న కట్లెట్ తిన్న కొద్ది నిమిషాల్లోనే అతడి ఆరోగ్యం క్షీణించి స్పృహతప్పి పడిపోయాడు. ఆ కట్లెట్ పాడైపోయి దుర్వాసన వస్తోందని, అది తిన్న వెంటనే ప్రిన్స్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి కిందపడిపోయాడని తోటి విద్యార్థి తెలిపాడు.

విద్యార్థి కళ్లు తిరిగి పడిపోగానే, పాఠశాల ఉపాధ్యాయులు అతడిని ఒక గదిలోకి తీసుకెళ్లి నోట్‌బుక్‌లతో విసురుతూ ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు సమాచారం అందించి, కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతే విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో “నా కొడుకుని నాకు తెచ్చివ్వండి” అంటూ తల్లి నిర్మల గుండెలవిసేలా రోదిస్తోంది.

పాఠశాలకు సమీపంలోనే ఆసుపత్రి ఉన్నప్పటికీ, యాజమాన్యం సకాలంలో స్పందించి అక్కడికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థికి సరైన వైద్య సాయం అందడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా కూడా స్పష్టమైంది. సమయానికి ఆసుపత్రికి చేర్చి ఉంటే తమ ఒక్కగానొక్క కొడుకు బతికేవాడు కదా అంటూ తండ్రి అమిత్ సోనీ కన్నీరుమున్నీరవుతున్నాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాల క్యాంటీన్ లైసెన్స్, ఆహార నాణ్యతా ప్రమాణాలపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఉదయం నవ్వుతూ స్కూలుకు వెళ్లిన కొడుకు శవమై తిరిగిరావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలముకుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *