“గుండెల్లో కరుణ లేదా..? ప్రాణాలతో ఉన్న కుక్క మెడకు రాయి కట్టి నదిలో పడేసిన క్రూర యువకుడు”.. మూగజీవిపై జరిగిన అమానుష ఘటన.. వీడియో వైరల్..!!

బంగ్లాదేశ్‌లోని నర్సింగ్డీ జిల్లాలో ఒక కుక్క మెడకు రాయి కట్టి నదిలో పడేసిన అమానుష ఘటన సోషల్ మీడియాలో బయటకు వచ్చి, ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, మహమ్మద్ అలీ (25) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నగరియా కండి వంతెనపై దుస్తులు లేకుండా ఉన్న ఆ యువకుడు, కుక్క మెడకు తాడు కట్టి, దానికి ఒక ఇటుకను బిగించి నదిలోకి విసిరేసిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతటి క్రూరత్వానికి పాల్పడుతున్న సమయంలో, ఒక మహిళతో సహా మరో ముగ్గురు వ్యక్తులు పక్కనే ఉండి ఏమాత్రం చలనం లేకుండా చూస్తుండటం, కుక్క నీటిలో ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ కొట్టుకుపోవడం చూసి నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జంతు సంక్షేమ కార్యకర్తల ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియో పోస్ట్ అయిన వెంటనే, ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆగ్రహించిన స్థానికులు నిందితుడు మహమ్మద్ అలీని పట్టుకుని, అతను చేసిన తప్పుకు బహిరంగంగా క్షమాపణ చెప్పేలా చేశారు. జంతు హింసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ క్రూరమైన చర్యలో నిందితుడికి సహకరిస్తూ, వేడుక చూస్తున్న మిగతా ముగ్గురు వ్యక్తులను కూడా గుర్తించి, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: