“గుక్కపెట్టి ఏడ్చిన ముగ్గురు పసిపిల్లలు..!” కన్నతల్లిని కోల్పోయిన క్షణం.. చేరదీసి ఆదుకున్న నిజమైన ఖాకీ దేవత.. తల్లిలా నిలబడి ఆశ్రమంలో చేర్పించిన ఏఎస్‌ఐ సోనియా పటేల్..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు చిన్నారుల తల్లి, గత సెప్టెంబర్ 22వ తేదీన అకస్మాత్తుగా మృతి చెందింది.

కన్నతల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ పసిపిల్లలు, తర్వాత ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో నిలబడిన తరుణంలో.. వారి కుటుంబానికి అండగా నిలిచారు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) సోనియా పటేల్.

మృతి చెందిన ఆ తల్లి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆ కుటుంబం ఇబ్బంది పడుతున్న సమయంలో, ఏఎస్‌ఐ సోనియా పటేల్ స్వయంగా ముందుండి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయించారు. అంతటితో తన బాధ్యత తీరిపోయిందని వెళ్లిపోకుండా, తల్లిని కోల్పోయి అల్లాడుతున్న ఆ ముగ్గురు ఆడపిల్లలకు అవసరమైన వైద్య సహాయం, ఆహారం, ఇతర ప్రాథమిక అవసరాలన్నీ అందేలా చూశారు.

భార్యను కోల్పోయిన దుఃఖంలోనూ, పిల్లల భవిష్యత్తు గురించిన ఆందోళనలోనూ ఉన్న వారి తండ్రికి ధైర్యం చెప్పిన సోనియా.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) నుంచి అధికారిక ఉత్తర్వులు పొందేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించారు.

అనంతరం, ఆ ముగ్గురు ఆడపిల్లలు సురక్షితంగా జీవించడానికి, వారి పునరావాసానికి మార్గం సుగమం చేసేలా భోపాల్‌లోని ‘మాతృ ఛాయ’ అనే ఆశ్రమంలో వారిని చేర్పించారు.

ఒకరికి సహాయం చేయడమంటే ఏదో ఒక పెద్ద పని చేసి వెళ్లిపోవడం మాత్రమే కాదు; వారు సురక్షితమైన స్థితికి చేరుకునే వరకు వెన్నంటి ఉండి ఆదుకోవడమే నిజమైన సహాయమని ఏఎస్‌ఐ సోనియా పటేల్ తన చేతల ద్వారా నిరూపించారు.


Posted

in

by

Tags: