“గ్యాస్ ఆదా, సమయం ఆదా అనుకుని మాస్ ప్లాన్ వేశాడు భయ్యా..” వీధి వ్యాపారి మైండ్ బ్లోయింగ్ ఐడియా.. వైరల్ వీడియో వెనుక కథ..!!!

వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి చేసే వినూత్న ప్రయత్నాలు చాలా సందర్భాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.

ఆ కోవలోనే, పాకిస్థాన్‌కు చెందిన ఒక చిన్న వీధి వ్యాపారి తన వ్యాపారం కోసం ఉపయోగించిన ఓ విచిత్రమైన టెక్నిక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

ఒకే కడాయిలో టీ మరియు పకోడీ రెండింటినీ ఒకేసారి తయారుచేసే అతని అసాధారణ ఆలోచన నెటిజన్ల దృష్టిని ఆకర్షించి, తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో.. మరిగే నూనెతో పకోడీలు వేయిస్తున్న అదే పెద్ద కడాయి మధ్యలో ఒక చిన్న గిన్నెను అమర్చి, అందులో టీని మరిగిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఒకే సమయంలో ఇటు వేడి వేడి టీ, అటు కరకరలాడే పకోడీ రెండూ రెడీ అయిపోతున్నాయి. ఇంధనంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేసేందుకు ఆ వ్యాపారి ఆలోచించిన ఈ ఐడియా చూడటానికి చాలా ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. పరిశుభ్రత, భద్రత పరంగా ఇది ఎంతవరకు సరైనదనే ప్రశ్నలను కూడా పలువురిలో లేవనెత్తింది.

నూనె వేడి, టీ మరుగుదల ఒకే చోట నిర్వహించడం కాస్త ప్రమాదకరమే అయినప్పటికీ.. ఆ వ్యాపారి సృజనాత్మకతను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో రకరకాల ఆసక్తికర కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

కొందరు “ఇది కదా అసలైన టాలెంట్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు” అంటూ అతని ఐడియాను ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం “టీలోకి నూనె వాసన వస్తుంది, ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు” అంటూ పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా, తన విభిన్నమైన ఆలోచనతో ఆ పాకిస్థానీ వ్యాపారి రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయిపోయాడు.


Posted

in

by

Tags: