భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘డిటెక్ట్-డిటైన్-డిపోర్ట్’ (గుర్తించి, బంధించి, దేశం నుండి పంపేయడం) విధానం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. డిటెన్షన్ సెంటర్‌కు పంపిస్తారన్న భయంతో అక్రమంగా ఉంటున్న వందలాది మంది బంగ్లాదేశీయులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు క్యూ కడుతున్నారు.
దళారుల నెట్వర్క్.. ’10 నిమిషాల గ్యాప్’ ఆట: అక్రమంగా భారత్‌లోకి ఎలా వచ్చారో స్వయంగా వారే బయటపెడుతున్నారు.
- నదీ మార్గాలు: చాలామంది నదులను ఈదుకుంటూ లేదా పడవల ద్వారా సరిహద్దు దాటినట్లు తెలిపారు.
- బీఎస్ఎఫ్ గస్తీ: దళారులు సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల గస్తీని గమనిస్తుంటారు. జవాన్ల పెట్రోలింగ్‌లో 10 నిమిషాల గ్యాప్ దొరికినా, వెంటనే గుంపులను సరిహద్దు దాటిస్తారని బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వెల్లడించాడు.
- లంచాలు: సరిహద్దు దాటించేందుకు దళారులు ఒక్కొక్కరి దగ్గర రూ. 7,000 నుండి రూ. 20,000 వరకు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.
‘లోకల్ సిండికేట్’ మరియు ప్రభుత్వ పథకాలు: కేవలం సరిహద్దు దాటడమే కాకుండా, భారత్‌లోకి వచ్చాక వీరికి రాజకీయ అండదండలు లభించేవని తేలింది.
- ఫేక్ డాక్యుమెంట్స్: పశ్చిమ బెంగాల్లో టీఎంసీ (TMC) స్థానిక కార్యకర్తలు వీరికి ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు వంటి నకిలీ పత్రాలను తయారు చేయించారని వలసదారులు అంగీకరించారు.
- ప్రభుత్వ పథకాలు: గత ప్రభుత్వ హయాంలో ‘లక్ష్మీ భండార్’ వంటి పథకాల ద్వారా వందలాది మంది బంగ్లాదేశీయులు లబ్ధి పొందడమే కాకుండా, ఓటు హక్కును కూడా వినియోగించుకున్నట్లు సమాచారం.
యజమానుల్లో భయం: ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడంతో, ఇప్పుడు అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇచ్చేందుకు ఇంటి యజమానులు భయపడుతున్నారు. సరైన గుర్తింపు కార్డులు లేని వారికి గది అద్దెకు ఇస్తే, రూ. 2 లక్షల జరిమానా మరియు రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉండటంతో, దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులకు ఆశ్రయం కరువైంది.
గట్టిపడుతున్న సరిహద్దు భద్రత: 4,096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో దాదాపు 79 శాతం ఇప్పటికే ఫెన్సింగ్ పూర్తయింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా పనులు వేగవంతం చేస్తున్నారు. సరిహద్దు భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 600 హెక్టార్ల భూమిని బీఎస్ఎఫ్ కు అప్పగించింది.
తిరిగి వెళ్తున్న వారికి ఉపశమనం: తమంతట తామే తిరిగి వెళ్తున్న వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని, వారిని సురక్షితంగా సరిహద్దు దాటించేలా చూడాలని కేంద్ర హోం శాఖ మరియు ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కఠిన చర్యల వల్ల దేశ అంతర్గత భద్రతతో పాటు, ప్రజల పన్నుల డబ్బుతో నడిచే సంక్షేమ పథకాలు కేవలం మన దేశ పౌరులకే అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
