ఘోరం: వందలాది మంది మైనర్ బాలికలు గర్భం; ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ప్రేమలే కారణం.. 300 మందిపై కేసులు!

Tamil Nadu News: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో సోషల్ మీడియా ద్వారా చిగురించిన ప్రేమ వ్యవహారాలు పెను విపత్తుకు దారితీశాయి. పెద్ద ఎత్తున జరిగిన బాల్య వివాహాల కారణంగా వందలాది మంది మైనర్ బాలికలు గర్భం దాల్చారు. ఈ వ్యవహారంలో పోలీసులు సుమారు 300 మంది యువకులపై కేసులు నమోదు చేశారు. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తిరుపత్తూరు జిల్లాలోని ఆంబూర్, వాణియంబాడి, నాట్రంపల్లి మరియు తిరుపత్తూరు తాలూకాల్లో 2025 సంవత్సరంలో వందలాది బాల్య వివాహాలు జరిగినట్లు రికార్డయ్యాయి. వీటిలో మెజారిటీ వివాహాలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఏర్పడిన పరిచయాల వల్ల జరిగినవేనని అధికారులు గుర్తించారు. మరికొందరు జంటలు రాష్ట్రం దాటి వెళ్లి మరీ ప్రేమ వివాహాలు చేసుకున్నట్లు విచారణలో తేలింది.

ఆసుపత్రుల్లో పెరుగుతున్న గర్భధారణ కేసులు
జిల్లా యంత్రాంగం అనేక బాల్య వివాహాలను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ప్రేమ వివాహాలు మరియు రహస్యంగా జరిగే పెళ్లిళ్లు ఆగడం లేదు. దీని ప్రభావం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులపై పడింది. మైనర్ బాలికలు గర్భం దాల్చడం మరియు ప్రసవం కోసం ఆసుపత్రులకు వస్తున్న కేసులు విపరీతంగా పెరగడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.

తల్లిదండ్రులు, యువకులపై కఠిన చర్యలు
ఈ తీవ్ర పరిస్థితు దృష్ట్యా, పోలీసులు అటు బాలికల తల్లిదండ్రులపై, ఇటు సంబంధిత యువకులపై కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఎక్కడైనా బాల్య వివాహం జరిగినట్లు సమాచారం అందితే తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియా ప్రభావం మరియు సామాజిక అవగాహన లోపం పిల్లల భవిష్యత్తును ఎలా ప్రమాదంలోకి నెడుతుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.


Posted

in

by

Tags: