రీల్స్ సైడ్ ఎఫెక్ట్స్ (Reels Side Effects): కోవిడ్ తర్వాత పిల్లల నుండి పెద్దల వరకు మొబైల్ ఫోన్‌ను తమ జీవితంలో ఒక విడదీయలేని భాగంలా భావిస్తున్నారు. ఉదయం కళ్లు తెరిచినప్పటి నుండి మంచం దిగే వరకు ఒకటి రెండు రీల్స్ చూడటం.. ఆఫీసుకి వెళ్లేటప్పుడు, తినేటప్పుడు.. ఇలా ఖాళీ సమయం దొరికితే చాలు రీల్స్ చూడకుండా ఉండలేనంతగా దాంతో సంబంధాన్ని పెంచుకున్నాం.
ఫ్యాషన్, హాస్యం, ఫిట్నెస్, వైరల్ వీడియోలు, డాన్స్, వంటలు.. ఇలా అన్ని రకాల రీల్స్ అన్ని వయసుల వారిని అలరిస్తున్నాయి. కొన్ని ఏళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం ఫోటోలు పంచుకోవడానికే వాడేవారు. కానీ నేడు, క్షణాల్లో మన దృష్టిని ఆకర్షించడానికి దీనిని రకరకాలుగా ఉపయోగిస్తున్నారు.
అయితే, నిత్యం రీల్స్ చూస్తూ ఎంత సమయం వృధా అవుతుందో తెలియకుండా స్క్రోల్ చేస్తూనే ఉండటం ఒక అలవాటుగా మారింది. రీల్స్‌లో సెకనుకోసారి మారుతూ ఉండే విషయాలు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం.
రీల్స్ చూడటం వల్ల ఏమవుతుంది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ చూసే అలవాటు మానవ మెదుడును ‘రివైర్’ (Rewire) చేస్తుంది. అంటే మీ మెదడు పనితీరును మార్చేసి, మీ ఏకాగ్రతను పూర్తిగా దెబ్బతీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
15-20 సెకన్ల వీడియోలను వరుసగా చూడటం వల్ల మానవ భావోద్వేగ ఆలోచనలపై కూడా సమస్యలు తలెత్తుతాయి. మెదడు తక్కువ సమయంలోనే సంతృప్తి చెందడానికి (Instant Gratification) అలవాటు పడటం వల్ల, ఎక్కువ సేపు ఒక విషయంపై దృష్టి కేంద్రీకరించడం కష్టమవుతుంది. దీనివల్ల చదవడం, పని చేయడం లేదా సుదీర్ఘమైన సంభాషణల్లో నిమగ్నమయ్యే సామర్థ్యం క్షీణిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెదడుపై ప్రభావం ఎలా ఉంటుంది?
వేగంగా సమాచారాన్ని అందించే రీల్స్‌ను పదేపదే చూడటం వల్ల, ఎక్కువ సేపు చదవడం లేదా సినిమా చూడటం, పని చేయడం వంటి వాటిపై ఆసక్తి తగ్గుతుంది. మెదడు ప్రతి గంటకు కొత్తదనాన్ని కోరుకుంటుంది. ప్రతిసారి మనం కొత్త రీల్ చూసినప్పుడు మన మెదడులో ‘డోపమైన్’ (Dopamine) అనే రసాయనం విడుదలవుతుంది. ఇది మనకు క్షణికానందాన్ని ఇస్తుంది.
నిరంతరం ఇలాంటి చిన్న చిన్న వీడియో ముక్కలను చూడటం వల్ల మెదడు కేవలం వేగవంతమైన, చిన్న సమాచారానికి మాత్రమే స్పందించడం నేర్చుకుంటుంది. దీనివల్ల క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మరియు లోతైన ఆలోచనా శక్తి తగ్గిపోతాయి. రోజంతా ఇలాంటి వీడియోలు చూడటం వల్ల మెదడు నిరంతరం ఉత్తేజితమై త్వరగా అలసిపోతుంది.
యువతలో నిద్ర సమస్యలు
ముఖ్యంగా పిల్లలు మరియు యువతలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. చదువుపై ఏకాగ్రత లేకపోవడమే కాకుండా, కళ్లకు విశ్రాంతి ఇవ్వకుండా స్క్రీన్ స్క్రోల్ చేయడం వల్ల చిరాకు మరియు నిద్రలేమి (Insomnia) వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక రకమైన ‘డిజిటల్ వ్యసనం’ (Digital Addiction) గా మారుతోందని వైద్యులు వివరిస్తున్నారు.
