కాన్పూర్‌కు చెందిన 16 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, బలవంతపు అబార్షన్ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
కాన్పూర్‌లోని రావత్పూర్ ప్రాంతానికి చెందిన ఈ బాలిక, చదువు నిమిత్తం కన్నౌజ్ జిల్లాలోని తిర్వాలో ఉన్న తన తాత, నానమ్మల ఇంట్లో ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో వరసకు మామ అయ్యే వ్యక్తి, అతని స్నేహితుడు బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. భయం, బెదిరింపుల కారణంగా ఆ బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయింది.
ఈ దారుణాల మధ్య ఆ బాలిక నాలుగు నెలల 20 రోజుల గర్భవతి అని కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు కుటుంబంలోని మరికొందరితో కలిసి వారు ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించారని బాలిక తల్లి ఆరోపించింది. తన కూతురికి జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, కాన్పూర్‌లోని రావత్పూర్ పోలీస్ స్టేషన్లో బాలిక తాత, నానమ్మ, మామ, అత్తతో సహా మొత్తం 10 మందిపై ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదైంది. నిందితులపై పోక్సో (POCSO) చట్టం, అత్యాచారం తదితర కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బాలిక వాంగ్మూలం, వైద్య నివేదికలు, అబార్షన్‌కు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత.. తదుపరి దర్యాప్తు కోసం ఈ కేసును కన్నౌజ్ జిల్లాలోని తిర్వా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దారుణంపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply