కొచ్చి: ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ (SMA Type-1) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారి మియా మరియా ప్రాణాలను కాపాడుకునేందుకు కేరళ ప్రజలంతా ఒక్కటయ్యారు. చిన్నారి చికిత్స కోసం అవసరమైన రూ. 16.5 కోట్లను కేవలం మూడు రోజుల్లోనే సేకరించి మానవత్వాన్ని చాటుకున్నారు.
అసలేం జరిగింది? మవట్టుపుళకు చెందిన జిను, నిమ్మి దంపతుల కుమార్తె మియా మరియా. నెల రోజుల క్రితం ఆ చిన్నారికి ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి సోకిన పిల్లలు కదలడం, శ్వాస తీసుకోవడం, ఆహారం మింగడం వంటి కనీస పనులు కూడా చేయలేరు. ప్రస్తుతం మియాకు ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. ఈ చిన్నారి ప్రాణాలు కాపాడాలంటే అత్యంత ఖరీదైన ‘జీన్ థెరపీ’ (Gene Therapy) అవసరమని, దీనికి సుమారు రూ. 16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు.
తల్లి ఆవేదన: “మియాకు ఏడాదిన్నర నిండకముందే జీన్ థెరపీ చేయాలని వైద్యులు సూచించారు. నా బిడ్డ నన్ను చూసి నవ్వినప్పుడు, తిరిగి నేను నవ్వలేకపోయేదాన్ని. ఎలా బతికించుకోవాలో అర్థం కాక ఆందోళన చెందేవాళ్లం. కానీ, ప్రజలు మాకు అందించిన ఈ అద్భుతమైన మద్దతు ఇప్పుడు మాలో కొత్త ఆశలను నింపింది” అని చిన్నారి తల్లి నిమ్మి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం చిన్నారి కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
