గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా గిరిజన రైతుల సమావేశంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.
నర్మదా జిల్లా సాగ్‌బారాలో జరిగిన గిరిజన రైతుల సదస్సులో శంకర్‌సింగ్ వాఘేలా మాట్లాడుతూ, “ఢిల్లీ, గాంధీనగర్‌లలో కూర్చున్న వారు రిజర్వేషన్లకు వ్యతిరేకులు. రిజర్వేషన్ అనేది ఎవరి భిక్షా కాదు; ఇది గిరిజనులకు ఎన్నో ఏళ్లుగా జరిగిన అన్యాయానికి దక్కిన పరిహారం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు కలిపి గుజరాత్‌కు 70 శాతం యజమానులుగా ఉన్నారు.
పటేల్, బనియా లేదా బ్రాహ్మణుడు.. ఎవరైనా సరే రిజర్వేషన్లను వ్యతిరేకించే వారు చెత్త ఎత్తే పనికి వస్తే, వారికి నెలకు రూ.50,000 జీతం ఇస్తాను” అని ఆయన అన్నారు. అంతేకాకుండా, 2027లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వాఘేలా చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై పాటిదార్, బ్రాహ్మణ సామాజిక వర్గాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పాటిదార్ సామాజిక వర్గ నేత దినేష్ బాంభానియా మాట్లాడుతూ, “రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు వాఘేలా ప్రయత్నిస్తున్నారు. దీనిపై మానవ హక్కుల సంఘంతో పాటు హైకోర్టులోనూ ఫిర్యాదు చేస్తాం” అని అన్నారు.
బీజేపీ నేత, బ్రహ్మ సమాజ్ కోఆర్డినేటర్ యజ్ఞేష్ దవే.. వాఘేలాకు నేరుగా సవాల్ విసిరారు. “చట్టబద్ధంగా రద్దు చేయబడిన పద్ధతి గురించి మళ్లీ మాట్లాడుతున్న వాఘేలా, పారిశుద్ధ్య పనిని ముందుగా తన సొంత ఇంటి నుంచే ప్రారంభించాలి. ఆయన వచ్చి నా ఇంటి చెత్త ఎత్తితే, ఆయనకు నెలకు రూ.5 లక్షలు ఇస్తాను” అని ఘాటుగా బదులిచ్చారు. 2017లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలా, 2027 ఎన్నికల కంటే ముందు మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ వివాదం చెలరేగడం గమనార్హం.

Leave a Reply