చెన్నై ఐటీ ఇంజనీర్ టు దిండిగల్ రైతు..! ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సంఘటన! డిజిటల్ లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం!

దిండిగల్: తమిళనాడులోని దిండిగల్ జిల్లా, పళని సమీపంలోని నరిక్కల్‌పట్టి గ్రామానికి చెందిన విఘ్నేష్ కుమార్ గతంలో చెన్నైలోని ఒక ప్రముఖ ఐటీ (IT) కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అయితే, వ్యవసాయంపై ఉన్న మక్కువతో అతను తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి సొంత ఊరికి తిరిగి వచ్చాడు. ఐటీ ఇంజనీర్ కాస్తా రైతుగా మారి వరి సాగు చేశాడు. అయితే, తాను పండించిన వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మి, దానికి సంబంధించిన డబ్బును త్వరగా విడుదల చేయించుకోవడానికి ఒక తాత్కాలిక ఉద్యోగికి రూ.20 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చింది. అయితే, సదరు లంచగొండి ఉద్యోగిని లంచ్‌ నిరోధక శాఖ (AC&V) పోలీసులు రూట్ మ్యాప్ వేసి మరి అడ్డంగా బుక్ చేశారు.

దిండిగల్ జిల్లా నరిక్కల్‌పట్టికి చెందిన 35 ఏళ్ల విఘ్నేష్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చదివి, చెన్నైలో మంచి ఐటీ ఉద్యోగం చేసేవాడు. కానీ, ఆ ఉద్యోగాన్ని వదిలేసి, వ్యవసాయం చేయాలనే సంకల్పంతో తన సొంత ఊరైన దిండిగల్‌కు వచ్చేశాడు.

తనకున్న 8½ ఎకరాల భూమిలో వరి పంటను సాగు చేశాడు. పంట చేతికి వచ్చిన తర్వాత, దాదాపు 250 బస్తాల ధాన్యాన్ని పళని సమీపంలోని నరిక్కల్‌పట్టిలో ఉన్న ప్రభుత్వ నెల్ (వరి) కొనుగోలు కేంద్రానికి గత జూన్ 12వ తేదీన తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ సీజనల్ బిల్ క్లర్క్‌గా పనిచేస్తున్న నత్తం తాలూకా కోటయ్యూర్ ఆండిపురం ప్రాంతానికి చెందిన సుమన్ రాజ్ (30) అనే ఉద్యోగి.. ఈ 250 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసి, దానికి సంబంధించిన రూ.2 లక్షల 50 వేల మొత్తాన్ని త్వరగా బ్యాంక్ ఖాతాలో వేయించాలంటే తనకు రూ.20 వేలు లంచం ఇవ్వాలని విఘ్నేష్ కుమార్‌ను డిమాండ్ చేశాడు. అంతేకాదు, అందులో మొదటి విడతగా రూ.5 వేలను వెంటనే ‘గూగుల్ పే’ (Google Pay) ద్వారా పంపమని చెప్పాడు.

విఘ్నేష్ కుమార్ కూడా వేరే దారి లేక అతను చెప్పినట్లే రూ.5 వేలను గూగుల్ పే ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తర్వాత సుమన్ రాజ్ మాట్లాడుతూ.. ఒకటి రెండు రోజుల్లో మీ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో పడిపోతుందని చెప్పాడు. అన్నట్లుగానే కొద్దిరోజుల క్రితం విఘ్నేష్ కుమార్ బ్యాంక్ అకౌంట్లోకి రూ.2 లక్షల 50 వేలు జమయ్యాయి.

అయితే, మిగిలిన లంచం డబ్బు ఇవ్వడం ఇష్టం లేని విఘ్నేష్ కుమార్.. దిండిగల్ జిల్లా లంచ్‌ నిరోధక శాఖ డిఎస్పీ నాగరాజ్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో సుమన్ రాజ్‌ను ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని పోలీసులు ప్లాన్ చేశారు.

పోలీసుల వ్యూహం ప్రకారం.. మిగిలిన డబ్బును నేరుగా వచ్చి నగదు రూపంలో ఇస్తానని సుమన్ రాజ్‌కు చెప్పమని విఘ్నేష్ కుమార్‌కు పోలీసులు సూచించారు. విఘ్నేష్ కూడా సుమన్ రాజ్‌కు ఫోన్ చేసి అదే విషయం చెప్పాడు.

అయితే, చాలా తెలివిగా వ్యవహరించిన సుమన్ రాజ్.. “నాకు చేతికి డబ్బులు వద్దు, కేవలం గూగుల్ పే ద్వారా మాత్రమే పంపించు” అని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో పోలీసుల సూచనల మేరకు విఘ్నేష్ కుమార్ మిగిలిన రూ.15 వేలను కూడా సుమన్ రాజ్‌కు గూగుల్ పే చేశాడు. ఆ తర్వాత డబ్బులు అందినట్లు సుమన్ రాజ్ ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయగా.. ఆ ఫోన్ కాల్ సంభాషణను విఘ్నేష్ కుమార్ ఆడియో రికార్డ్ చేసి పోలీసులకు డిజిటల్ సాక్ష్యంగా అందించాడు.

వెంటనే రంగంలోకి దిగిన లంచ్‌ నిరోధక శాఖ పోలీసులు నత్తం ప్రాంతానికి వేగంగా చేరుకుని సుమన్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దిండిగల్‌లోని తమిళనాడు కన్స్యూమర్ గూడ్స్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి నిన్న రాత్రి విచారించారు. నేరం నిరూపణ కావడంతో సుమన్ రాజ్‌ను అధికారికంగా అరెస్ట్ చేసి దిండిగల్ ఏసీబీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ డిజిటల్ లంచం కేసు ఉదంతం ప్రస్తుతం దిండిగల్ జిల్లా ప్రభుత్వ అధికారుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.


Posted

in

by

Tags: