“చెయ్యి ఊడిపోతుంది భయ్యా…” అని అరిచిన మొబైల్ దొంగ; 9 కి.మీ వరకు కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు!

బీహార్: బరౌని-కతిహార్ రైల్వే మార్గంలో అత్యంత ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. జనహిత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మొబైల్‌ను దొంగిలించడానికి ప్రయత్నించిన యువకుడికి ప్రయాణికులు తగిన శాస్తి చేశారు. జూలై 9న రాత్రి మాన్సీ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఏం జరిగింది?
రైలు కిటికీ గుండా చేయి పెట్టి మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ఆ దొంగ ప్రయత్నించాడు. అయితే ప్రయాణికులు వెంటనే స్పందించి అతని చేతిని గట్టిగా పట్టుకున్నారు. రైలు కదులుతున్నా, ఆ యువకుడు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ప్రయాణికులు పట్టు వదలలేదు. ఇలా మాన్సీ స్టేషన్ నుండి ఖగడియా స్టేషన్ వరకు, సుమారు 9 కిలోమీటర్ల దూరం ఆ యువకుడు రైలు కిటికీకి వేలాడుతూనే ఉన్నాడు. “చెయ్యి ఊడిపోతుంది భయ్యా, వదిలేయండి” అని దొంగ బతిమాలినా ప్రయాణికులు వినలేదు.

సహచరుల ప్రయత్నం విఫలం
దొంగతో పాటు మరికొందరు సహచరులు కూడా అక్కడే ఉన్నప్పటికీ, ప్రయాణికుల అప్రమత్తత ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. రైలులో ఉన్న ప్రయాణికులు ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసులకు అప్పగింత
ఖగడియా స్టేషన్‌కు చేరుకున్నాక, ప్రయాణికులు సదరు దొంగను రైల్వే పోలీసులకు (GRP) అప్పగించారు. అరెస్టు చేసిన యువకుడిని భాగల్పూర్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఫకృద్దీన్ అలియాస్ చోటుగా గుర్తించినట్లు ఖగడియా GRP స్టేషన్ ఇన్‌ఛార్జ్ మొహమ్మద్ అలావుద్దీన్ తెలిపారు. ప్రాథమిక విచారణలో అతను మొబైల్ దొంగిలించడానికి ప్రయత్నించినట్లు తేలిందని, అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.


Posted

in

by

Tags: