ఢిల్లీలోని జంగ్‌పురా (Jangpura) ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు శనివారం ఉదయం తన ఇంట్లోనే అత్యంత కిరాతకంగా హత్యకు గురై విగతజీవిగా కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగిపోవడంతో, ఆ వృద్ధురాలు 1985 నుంచి అదే ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్నారు. శనివారం ఉదయం తల్లిని చూసేందుకు వచ్చిన కుమార్తె.. ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూసింది. అక్కడ బెడ్‌రూమ్‌లో తల్లి రక్తపు మడుగులో శవమై పడి ఉండటం చూసి భయాందోళనతో ఆర్తనాదాలు చేసింది. మృతురాలి చేతులు కట్టేసి ఉన్నాయని, ముఖంపై బలమైన గాయాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇంట్లోని బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దుండగులు దోచుకెళ్లారు. అంతేకాకుండా, చుట్టుపక్కల వారు బయటకు వచ్చి తమను పట్టుకోకుండా ఉండేందుకు హంతకులు పక్కిళ్ల తలుపులను సైతం బయటి నుంచి గడియ పెట్టి ఈ దారుణానికి పాల్పడ్డారు. సీసీటీవీ (CCTV) ఫుటేజీల ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల భద్రతను పటిష్టం చేయాలన్న డిమాండ్ ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చింది.

Leave a Reply