QR కోడ్ ఫ్రాడ్: ప్రస్తుతం మొబైల్ ద్వారా QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయడం ఎంత సాధారణమైపోయిందంటే.. జనం ఆలోచించకుండానే ఫోన్ తీసి డబ్బులు పంపేస్తున్నారు. కూరగాయల బండి నుండి టీ కొట్టు వరకు, పార్కింగ్ స్థలాల నుండి పెద్ద స్టాళ్ల వరకు ప్రతిచోటా QR కోడ్ కనిపిస్తోంది. ప్రజలు జేబులో నగదు ఉంచుకోవడం దాదాపు మానేశారు. అయితే, ఇదే సౌకర్యాన్ని కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. QR కోడ్ స్కాన్ చేయగానే బ్యాంక్ బ్యాలెన్స్ మాయమైపోతున్న ఘటనలు చాలా నగరాల్లో వెలుగుచూస్తున్నాయి.
నకిలీ QR కోడ్ల మాయాజాలం: రద్దీగా ఉండే ప్రదేశాల్లోని అసలైన QR కోడ్ స్టిక్కర్లను తొలగించి, స్కామర్లు తమ సొంత నకిలీ (Fake) QR కోడ్లను అక్కడ అంటిస్తున్నారు. పైకి చూడటానికి రెండూ ఒకేలా ఉండటంతో జనం గుర్తించలేకపోతున్నారు. తొందరలో ఉన్నవారు సరిచూసుకోకుండా స్కాన్ చేయగానే అసలు సమస్య మొదలవుతుంది. సాధారణంగా డబ్బులు పంపేటప్పుడు మనం మొత్తం ఎంటర్ చేయాలి, కానీ ఈ నకిలీ కోడ్లను స్కాన్ చేయగానే నేరుగా ‘పిన్’ (PIN) ఎంటర్ చేయమని లేదా పేమెంట్ కన్ఫర్మ్ చేయమని అడుగుతాయి. జనం ఇది కొత్త పద్ధతి అనుకుని పిన్ ఎంటర్ చేయగానే, సెకన్ల వ్యవధిలో వారి ఖాతా నుండి డబ్బులు కట్ అయిపోతాయి.
ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? డబ్బులు పంపడానికి QR కోడ్ స్కాన్ చేయాలని మనకు తెలుసు. కానీ స్కామర్లు “డబ్బులు రావడానికి (Receive) స్కాన్ చేయండి” అని నమ్మిస్తారు. ఇదే అతిపెద్ద అబద్ధం. గుర్తుంచుకోండి.. ఎవరి దగ్గర నుండైనా డబ్బులు తీసుకోవడానికి మనం QR కోడ్ స్కాన్ చేయాల్సిన లేదా పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. OLX వంటి సైట్లలో వస్తువులు కొంటామని ఫోన్ చేసి, అడ్వాన్స్ పంపిస్తామని ఒక QR కోడ్ పంపిస్తారు. దాన్ని స్కాన్ చేయగానే మీ ఖాతాలో డబ్బులు పడటానికి బదులు, మీ ఖాతా నుండే కట్ అవుతాయి. కొన్నిసార్లు ఈ కోడ్ల ద్వారా ఫోన్లోకి వైరస్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
జాగ్రత్తగా ఉండటానికి చిట్కాలు:
- డబ్బులు తీసుకోవడానికి పిన్ లేదా స్కాన్ అవసరం లేదు: ఎవరైనా డబ్బులు పంపిస్తామని చెప్పి మిమ్మల్ని స్కాన్ చేయమంటే అది 100% మోసమని గ్రహించండి.
- పేరును సరిచూసుకోండి: QR కోడ్ స్కాన్ చేయగానే స్క్రీన్‌పై వచ్చే పేరును దుకాణదారుడిని అడిగి కన్ఫర్మ్ చేసుకోండి.
- లింక్‌లపై క్లిక్ చేయకండి: గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దు.
- రహస్య సమాచారం: మీ UPI పిన్, OTP లేదా పాస్‌వర్డ్‌లను బ్యాంక్ అధికారులమని చెప్పే వారికి కూడా ఎప్పుడూ చెప్పకండి.
మోసపోతే ఏం చేయాలి? ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది.
