దేశంలో కొత్తగా 700 రూపాయల నోట్లను ప్రవేశపెట్టబోతున్నారని, ప్రస్తుత కాగితపు నోట్లకు బదులుగా జూన్ 30 నుండి ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి రానున్నాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు సాధారణ ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని, చర్చను లేవనెత్తాయి.
ఈ నేపథ్యంలో, ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న కరెన్సీ మార్పుల వెనుక ఉన్న అసలు నిజాలు ఏమిటి? దీనిపై కేంద్ర ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన అధికారిక వివరణలు ఏమిటో ఇక్కడ క్లుప్తంగా చూద్దాం..!!
కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పేరిట సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక పోస్ట్ ప్రజల్లో అనవసర భయాందోళనలను, ఉత్కంఠను రేకెత్తించింది.
కాగితపు కరెన్సీ నోట్లు: ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లు త్వరగా చిరిగిపోతున్నాయని, మురికిగా మారుతున్నాయని.. వాటి స్థానంలో ఎక్కువ కాలం మన్నే ప్లాస్టిక్ నోట్లను వచ్చే జూన్ 30వ తేదీ నుండి కొత్తగా మార్కెట్లోకి తీసుకురాబోతున్నారని ఆ వార్త సారాంశం. ఈ సమాచారం సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది.
ఈ పోస్టులను చూసిన ప్రజలు తమ వద్ద ఉన్న కాగితపు డబ్బులు ఎక్కడ చెల్లకుండా పోతాయోనని తీవ్ర ఆందోళన చెందారు.
పాలిమర్ కరెన్సీ – ప్లాస్టిక్ నోట్లు: ఈ వివాదం వెనుక ఉన్న అసలు నేపథ్యాన్ని పరిశీలిస్తే.. భారతదేశంలో నోట్ల మన్నికను పెంచడానికి, తయారీ వ్యయాన్ని తగ్గించడానికి కాగితపు నోట్ల కంటే 3 రెట్లు ఎక్కువ కాలం మన్నే ప్లాస్టిక్ నోట్లను, అంటే పాలిమర్ కరెన్సీని తీసుకురావాలనే ఆలోచన రిజర్వ్ బ్యాంక్‌కు ఉన్న మాట వాస్తవమే.
దీనికోసం ఆర్బీఐ మొదటిసారిగా 2012లోనే ఈ ప్రాజెక్ట్‌ను పరిశీలించింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఇప్పుడు దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా వంటి దేశాల తరహాలోనే భారత్‌లోనూ ప్లాస్టిక్ నోట్ల ముద్రణపై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి.
700 రూపాయల నోట్లు: ఈ వార్తలతో పాటు మరో సంచలన సమాచారం కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టింది. మనం క్రమం తప్పకుండా వాడే 500 రూపాయల నోట్లకు బదులుగా, ఆర్బీఐ త్వరలోనే కొత్తగా రూ. 700 నోట్లను చలామణిలోకి తెస్తుందని ప్రచారం చేశారు. మహాత్మా గాంధీ చిత్రంతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా (NASA) లోగో ముద్రించి ఉన్న ఒక నోటు ఫోటో ‘ఎక్స్’ (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో విపరీతంగా వైరల్ అయ్యింది.
దేశ ఆర్థిక వ్యవస్థను సమతుల్యం చేయడానికి ఆర్బీఐ నిజంగానే ఇలాంటి నోటును తీసుకువస్తోందేమోనని ప్రజలు నమ్మారు. కానీ, ఈ రూ. 700 నోటు వార్త ముమ్మాటికీ పచ్చి అబద్ధమని, ఎవరో ఆకతాయిలు చేసిన గ్రాఫిక్స్ ఎడిటింగ్ పని అని ఆర్థిక నిపుణులు తేల్చి చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం వివరణ: రూ. 700 వంటి వింత నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెడితే చిల్లర సమస్య మరింత తీవ్రమవుతుందని, కాబట్టి అలాంటి ఆలోచన ఏదీ లేదని అధికారులు స్పష్టం చేశారు.
అయితే, ఈ రెండు అంశాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారడంతో, కేంద్ర ప్రభుత్వ అధికారిక మీడియా విభాగమైన పీఐబీ (PIB – ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు పూర్తిగా సత్యదూరమని, జూన్ 30 నుండి కాగితపు నోట్లు చెల్లవనే పుకార్లను ప్రజలు ఎవరూ నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, జూన్ 30 నుండి కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏదీ లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా అధికారికంగా ఖండించింది…!!

Leave a Reply