జైలు ఊడ్చడం, ఆకులు ఏరడం.. పాకిస్థాన్ జైలులో ఏడేళ్ల పాటు ఆ యువకుడు అనుభవించిన నరకం ఇదీ!

ప్రసన్నజీత్ రంగారి ఏడేళ్ల పాటు పాకిస్థాన్ జైలులో బందీగా ఉండి, ఎట్టకేలకు ఫిబ్రవరి 6న తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. 2015లో అదృశ్యమైన ప్రసన్నజీత్, 2021లో పాకిస్థాన్ జైలులో ఉన్నట్లు తెలిసింది. మానసిక అనారోగ్యంతో ఉన్న ఆయన, తన విడుదల తర్వాత పాక్ జైళ్లలో భారతీయ ఖైదీల పట్ల అక్కడి అధికారులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో వివరించారు.

చదువులో రాణించినా.. విధి వంచించింది: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన ప్రసన్నజీత్ చదువులో చాలా చురుకైనవాడు. తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, పొలం అమ్మి మరీ కొడుకును జబల్‌పూర్‌లో బి.ఫార్మసీ చదివించారు. ఆ తర్వాత మాస్టర్స్ కోర్సులో చేరినా, డబ్బులు లేక మధ్యలోనే ఆపేశాడు. ఉద్యోగం కోసం ఇండోర్ వెళ్లిన ప్రసన్నజీత్, అక్కడ సఫలం కాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయన మానసిక స్థితి దెబ్బతిని, 2015లో ఇంటి నుండి అదృశ్యమయ్యాడు.

పాక్ జైలులో దినచర్య: ప్రసన్నజీత్ కథనం ప్రకారం.. పాక్ జైలులో ఉదయం 7 గంటలకు నిద్రలేపి టీ, రొట్టె ఇచ్చేవారు. 7:30 గంటల నుండి పని చేయించేవారు. జైలు ఆవరణను ఊడ్చడం, రాలిన ఆకులను ఏరడం వంటి పనులు ఆయనతో చేయించేవారు. మధ్యాహ్నం మటన్, అన్నం పెట్టేవారు. సాయంత్రం కొంతసేపు టీవీ చూసేందుకు అనుమతించి, రాత్రి 9 గంటలకు బ్యారక్‌లోకి పంపేవారు.

పోరాడి సాధించిన చెల్లెలు: తన అన్న పాకిస్థాన్ జైలులో ఉన్నాడని 2021 డిసెంబర్ 31న సోదరి సంఘమిత్రకు తెలిసింది. అప్పటి నుండి ఆమె కలెక్టర్ కార్యాలయాలు, నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. చివరకు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కపిల్ ఫూలే సాయంతో మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ వేశారు. “ఎలాంటి విచారణ లేకుండా, చట్టపరమైన సాయం లేకుండా ఒక మానసిక రోగిని జైలులో ఉంచడం హక్కుల ఉల్లంఘన” అని వారు వాదించారు. ఈ పోరాటం వల్ల భారత్, పాక్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగి, ప్రసన్నజీత్ పౌరసత్వం ఖరారై ఆయన విడుదలయ్యారు.

అసలు ఎలా తెలిసింది? చాలా కాలం వరకు ప్రసన్నజీత్ చనిపోయాడని కుటుంబ సభ్యులు భావించారు. అయితే 2021లో, పాకిస్థాన్ జైలు నుండి 29 ఏళ్ల తర్వాత విడుదలైన కుల్జీత్ సింగ్ కచ్వాహా అనే వ్యక్తి.. ప్రసన్నజీత్ పాక్ జైలులో ఉన్నాడన్న విషయాన్ని కుటుంబానికి చేరవేయడంతో ఈ గమనం మొదలైంది.


Posted

in

by

Tags: