కాన్పూర్ వ్యాపారవేత్త వినీత్ వినోచా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన మామను హతమార్చేందుకు కోడలు షాలు ఏకంగా రూ. 6 లక్షల సుపారీ ఇచ్చి కిరాయి హంతకులను పురమాయించిందన్న ఆరోపణలతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అయితే, షాలు కుటుంబ సభ్యులు, ఆమె తరఫు న్యాయవాది మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. జైల్లో ఉన్న షాలు ఈ పరిణామంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, ఆమె ఇలాంటి ఘోరమైన నేరానికి పాల్పడే అవకాశమే లేదని ఆమె సోదరి స్పష్టం చేశారు.
మరోవైపు, ఈ కేసులో షాలు భర్త సుబ్రతా అనుమానాస్పద మౌనంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లభించడం లేదని, ఇంతటి తీవ్రమైన కేసులో ఆయన వెంటనే బయటకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడించాలని షాలు కుటుంబీకులు, న్యాయవాది డిమాండ్ చేస్తున్నారు.
పోలీసు విచారణలో పట్టుబడిన కిరాయి హంతకులు విశాల్, రాజ్ కిషోర్లు తాము షాలు చెప్పినందువల్లే పక్కా పథకం ప్రకారం ఈ హత్య చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. అయితే, హంతకులు సుబ్రతా పేరును ప్రస్తావించకుండా నేరుగా షాలు పేరునే చెప్పడం వెనుక కుట్ర దాగి ఉండవచ్చని ఆమె న్యాయవాది వాదిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు షాలు, ఆమె మాజీ ఉద్యోగి విశాల్, అతని సహచరుడు రాజ్ కిషోర్లను ప్రధాన నిందితులుగా భావించి దర్యాప్తును ముమ్మరం చేశారు. భర్త సుబ్రతా అసలు పరారీలో ఉన్నాడా లేక ఈ హత్య వెనుక ఇంకా ఏవైనా రహస్య కోణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
