నిరుద్యోగం ఒక శాపం అని చాలామంది భావిస్తారు, కానీ ఫిలడెల్ఫియాకు చెందిన నిక్ గ్రీనావాల్ట్ మాత్రం దానినే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశంగా మార్చుకున్నాడు. తన ఇంట్లోని టాయిలెట్ కమ్మోడ్ మీద ప్రకటనల కోసం స్థలాన్ని కేటాయించి, ఏకంగా 10 లక్షల డాలర్లు (సుమారు రూ. 8.3 కోట్లు) సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లు సైతం నిక్ బాత్‌రూమ్‌లో చోటు కోసం క్యూ కడుతున్నాయి.
ప్రముఖ బ్రాండ్ల సందడి: నిక్ తన టాయిలెట్ మీద ప్రొజెక్షన్ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించి బ్రాండ్ లోగోలను ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటికే క్లోరాక్స్ (Clorox), పైన్-సోల్ (Pine-Sol), మిరాలాక్స్ (MiraLAX) వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ యాడ్స్ ఇచ్చాయి. ‘డాక్టర్ స్క్వాచ్’ (Dr Squatch) అనే గ్రూమింగ్ బ్రాండ్ కూడా ఇందులో భాగమైంది.
క్రిప్టో పేమెంట్స్ సంస్థ ‘మూన్‌పే’ (MoonPay) స్పందిస్తూ.. “మేము ఒక అపరిచితుడి టాయిలెట్ బౌల్ మీద ప్రకటన ఇచ్చాం. కేవలం 24 గంటల్లోనే మా వీడియోకు 10 లక్షల వ్యూస్ వచ్చాయి, యాప్ డౌన్‌లోడ్స్ పెరిగాయి. దీని కోసం మేము మా వార్షిక మార్కెటింగ్ బడ్జెట్‌లో కేవలం 0.05% మాత్రమే ఖర్చు చేశాం” అని తన పోస్ట్‌లో పేర్కొంది.
సోషల్ మీడియాలో రచ్చ: నిక్ పోస్ట్ చేస్తున్న ఈ వీడియోలకు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ఒక వీడియోకు ఏకంగా 4 కోట్ల (40 మిలియన్లు) వ్యూస్ రాగా, మరో వీడియోకు 1.3 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ “క్రియేటివ్” కాన్సెప్ట్‌ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.
“నువ్వు క్రియేటివ్ వ్యక్తులందరికీ ఒక స్ఫూర్తివి. సోషల్ మీడియాలో సృజనాత్మకతకు అంతులేదని నిరూపించావు. నువ్వు అనుకున్న మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోవాలని కోరుకుంటున్నాం” అంటూ యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు.
