ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఉన్న ఓ ప్రముఖ అపార్ట్మెంట్ సముదాయంలో పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకురావడంపై ఇద్దరు మహిళల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళా టీచర్‌పై మరో మహిళ విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపింది.
చదువుకున్నవారు, ఉన్నత హోదాల్లో పనిచేసేవారు నివసించే విలాసవంతమైన అపార్ట్మెంట్ సముదాయంలోనే ఈ దాడి జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సంఘటన రోజున అపార్ట్మెంట్లో నివసించే ఓ మహిళా టీచర్ లిఫ్ట్ కోసం వేచి ఉండగా, మరో మహిళ తన పెంపుడు కుక్కతో లిఫ్ట్‌లోకి వచ్చింది.
లిఫ్ట్ వంటి ఇరుకైన ప్రదేశంలో కుక్కను తీసుకురావడంతో, ఇతరులకు ఇబ్బంది కలగకుండా కుక్కను జాగ్రత్తగా పట్టుకోవాలని టీచర్ మర్యాదపూర్వకంగా సూచించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ మాటతో ఆగ్రహించిన కుక్క యజమాని మహిళ.. టీచర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగింది. కొద్ది క్షణాల్లోనే పరిస్థితి చేయి దాటి, ఆమెపై దాడికి పాల్పడినట్లు సమాచారం.
టీచర్ అని కూడా చూడకుండా లిఫ్ట్‌లోనే తనపై దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా కలత చెందారు. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
లిఫ్ట్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో మొత్తం ఘటన స్పష్టంగా రికార్డైంది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. బాధిత టీచర్‌కు న్యాయం చేయడంతో పాటు, దాడికి పాల్పడిన మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా విచారణ కొనసాగుతోంది.
ఇటీవలి కాలంలో అపార్ట్మెంట్ సముదాయాల్లో పెంపుడు జంతువులకు సంబంధించిన చిన్నచిన్న వివాదాలు తీవ్ర ఘర్షణలకు దారితీస్తుండటంపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
