చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఒమన్ నుండి ప్రయాణించి వచ్చిన ఒక వ్యక్తి గురించి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. విశేషమేమిటంటే, ఆయన మద్దతు ఇచ్చిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించడమే ఇందుకు కారణం.
ఒమన్‌లోని మస్కట్‌లో పనిచేస్తున్న మణికందన్ శివానందం అనే వ్యక్తి ఈ ఘనత సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, ఆయన ఎక్స్ (X) వేదికగా ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) కు ఓటు వేయడానికి తాను 3,000 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణించి వచ్చినట్లు తెలిపారు.
ఒక్క ఓటు నిర్ణయించిన ఫలితం
శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం ఆన్‌లైన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి, డీఎంకే సీనియర్ నేత మరియు మంత్రి కేఆర్ పెరియకరుప్పన్‌ను కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడించారు. తుది లెక్కల ప్రకారం, సేతుపతి 83,375 ఓట్లు సాధించి డీఎంకే అభ్యర్థిపై అతి స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు.
ఫలితం వెలువడగానే మణికందన్ ఇలా రాశారు: “తిరుపత్తూరు నియోజకవర్గంలో టీవీకే కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచింది. తలపతికి ఓటు వేయడానికి మస్కట్ నుండి భారత్ వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను.” ఈ ఒక్క ఓటు విజయానికి మణికందన్ ప్రయాణమే కీలకమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఏప్రిల్ 16నే ఆయన తన ఫ్లైట్ టికెట్ ఫోటోను షేర్ చేస్తూ టీవీకేకి ఓటు వేయడానికి వస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
సోషల్ మీడియా స్పందన
ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్లు మణికందన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
“మీ ఒక్క ఓటే ఫలితాన్ని మార్చింది, మీరు చరిత్ర సృష్టించారు” అని ఒకరు కామెంట్ చేయగా..
“తమిళనాడు ఎన్నికల్లో ఇంకా ఎన్ని అద్భుతాలు చూస్తామో! మస్కట్ నుండి వచ్చి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు” అని మరొకరు రాశారు.
“మా విజయాన్ని కాపాడావు (You saved our day)” అంటూ టీవీకే మద్దతుదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సంచలనం సృష్టించిన టీవీకే
ఫిబ్రవరి 2024లో ప్రారంభమైన విజయ్ పార్టీ, తన మొదటి ఎన్నికల్లోనే తిరుగులేని ప్రదర్శనతో ప్రత్యర్థులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించి, ఏఐఏడీఎంకేను మూడవ స్థానానికి నెట్టేసింది.
అత్యంత ఆశ్చర్యకరంగా, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు. గీతా జీవన్, మా సుబ్రమణియన్ వంటి పలువురు మంత్రులు కూడా తమ స్థానాలను కోల్పోయారు. టీవీకే సుమారు 35 శాతం ఓట్ల షేర్‌ను సాధించినప్పటికీ, సొంతంగా మెజారిటీ మార్కును (118) అందుకోలేకపోయింది. దీంతో చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
