బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో (IndiGo) సంస్థ గ్రౌండ్ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న మహ్మద్ జంషీద్ అనే యువకుడు, తాను ఎంతో ఇష్టపడి చేరిన తన ‘కలల ఉద్యోగానికి’ రాజీనామా చేశాడు.
విధుల్లో ఉన్న సమయంలో పొరపాటున టై (Tie) ధరించడం మర్చిపోయినందుకు, సంస్థకు చెందిన ఒక సీనియర్ అధికారి తనను తీవ్రంగా అవమానిస్తూ విధించిన శిక్షే దీనికి కారణమని ఆయన తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపించారు.
విమానాశ్రయ టెర్మినల్లో సాధారణ తనిఖీలు చేస్తున్న సమయంలో, జంషీద్ టై ధరించకపోవడాన్ని గమనించిన సప్తర్షి ముఖర్జీ అనే సీనియర్ అధికారి దీనిపై నిలదీశారు. జంషీద్ తన తప్పును ఒప్పుకుని తక్షణమే క్షమాపణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ, తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ అధికారి.. మహిళా సూపర్వైజర్ను పిలిచి, నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిని లోపలికి ఎలా అనుమతించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతటితో ఆగకుండా, సూపర్వైజర్కు క్షమాపణలు చెప్పడమే కాకుండా, ఆమె కాళ్లపై పడి నమస్కరించాలంటూ జంషీద్ను ఆదేశించారు. ఒక ప్రొఫెషనల్ పని ప్రదేశంలో ఇది అత్యంత దిగజారిన, అవమానకరమైన చర్య అని పేర్కొంటూ జంషీద్ అందుకు నిరాకరించాడు. దీనితో సదరు అధికారి అతడిని వెంటనే టెర్మినల్ నుండి బయటకు వెళ్ళిపోవాలని చెప్పారు.
ఈ ఘటనతో తీవ్ర అవమానానికి గురైన జంషీద్, ఇండిగో సంస్థ యొక్క ఎథిక్స్ అండ్ కంప్లయన్స్ కమిటీకి దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశాడు. సంస్థ ఈ ఫిర్యాదుపై విచారణ జరిపినప్పటికీ.. ఘటన జరిగిన రోజున జంషీద్ అక్కడ ఉన్నట్లు చూపించే సీసీటీవీ దృశ్యాలు లేవని నెపంతో విచారణను ముగించేసిందని ఆయన తెలిపారు.
సంస్థ తీసుకున్న ఈ బాధ్యతారాహిత్యమైన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనైన జంషీద్, తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పని ప్రదేశాల్లో ఉద్యోగుల గౌరవాన్ని, మర్యాదను కాపాడాలనే అంశంపై ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
