ట్యాక్సీలో మర్చిపోయిన 4 ఏళ్ల బాలుడిని బెంగళూరు పోలీసులు క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ చిన్నారి కారులో ఉన్నాడన్న విషయం గమనించకుండానే డ్రైవర్ మరో మూడు సవారీలు (ట్రిప్పులు) చేసి వచ్చాడు.
అసలేం జరిగిందంటే?
బెంగళూరులోని హెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒక దంపతులకు 4 ఏళ్ల కుమారుడు (జియాన్ చుంగీ) ఉన్నాడు. ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) ఆ కుటుంబం ఇస్కాన్ ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంది. దర్శనం ముగించుకుని రాత్రి సమయంలో తమ అపార్ట్‌మెంట్‌కు వెళ్లడానికి ఒక కాల్ టాక్సీని బుక్ చేసుకున్నారు. ప్రయాణంలో అలసిపోయిన జియాన్ కారు వెనుక సీట్లో పడుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు.
రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పొన్నప్ప లేఅవుట్లోని తమ ఇంటి వద్ద కారు ఆగగానే.. దంపతులు కారు దిగి లోపలికి వెళ్లిపోయారు. నిద్రలో ఉన్న జియాన్‌ను ఎత్తుకోవడం మర్చిపోయి కారులోనే వదిలేశారు.
2 నిమిషాల్లో రంగంలోకి దిగిన పోలీసులు:
కాసేపటి తర్వాత తమ కుమారుడు కనిపించకపోవడంతో ఆ దంపతులు ఆందోళనకు గురయ్యారు. అప్పుడు వారికి జియాన్ కారులోనే ఉన్నాడన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే డ్రైవర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినా వీలు పడలేదు. దీంతో కంగారు పడిన వారు వెంటనే పోలీసు సహాయ కేంద్రం (Namma 112) కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
సమాచారం అందిన కేవలం 2 నిమిషాల్లోనే హెన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరాలను పరిశీలించి కారు నంబర్‌ను గుర్తించారు. పోలీసుల ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్’ (CCTNS) యాప్ ద్వారా డ్రైవర్ వివరాలను సేకరించి, అతనికి ఫోన్ చేసి వెంటనే వెనక్కి రమ్మని ఆదేశించారు.
3 సవారీలు చేసినా తెలియని వైనం:
డ్రైవర్ తిరిగి రాగానే పోలీసులు వెనుక సీటును తనిఖీ చేయగా.. జియాన్ ఏమీ తెలియనట్లు హాయిగా నిద్రపోతూ కనిపించాడు. పోలీసులు బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. డ్రైవర్‌ను విచారించగా, “బాబు కారులో ఉన్నాడన్న విషయం నేను గమనించలేదు, ఈ మధ్యలో నేను ముగ్గురు ప్యాసింజర్లను కూడా తీసుకెళ్లాను” అని చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. ఆ ముగ్గురు ప్రయాణికులు కూడా బాబును గమనించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
చివరగా, తల్లిదండ్రులను మరియు డ్రైవర్‌ను హెచ్చరించి పోలీసులు అక్కడి నుండి వెళ్లారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
