టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమ ఆసియాలో యుద్ధం ముగిసిందని ఆశపడుతున్న తరుణంలో ఇరాన్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికా తలపెట్టిన భారీ దాడులు రెండు వారాల పాటు నిలిచిపోవడాన్ని ఇరాన్ తన “గొప్ప దౌత్య విజయం”గా అభివర్ణించుకుంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ తాత్కాలిక సంధి వెనుక తాము విధించిన 10 కఠినమైన షరతులకు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది.
విజయోత్సవాల్లో ఇరాన్.. ఆ 10 పాయింట్ల ప్లాన్ ఏంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కొద్దిసేపటి ముందు ఈ విరామం ప్రకటించడం ఇరాన్ పౌరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇరాన్ జాతీయ టెలివిజన్ ప్రసారాల ప్రకారం, అమెరికా దిగిరావడానికి కారణం ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళికేనని తెలుస్తోంది. ఆ షరతులు ఇవే:
- దురాక్రమణ నిలిపివేత: ఇరాన్‌పై అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు చేయకూడదు.
- హార్ముజ్ జలసంధి: ఈ కీలక జలమార్గంపై ఇరాన్ నియంత్రణే కొనసాగాలి.
- యురేనియం శుద్ధి: అణు కార్యక్రమం కోసం యురేనియం శుద్ధికి అనుమతి ఇవ్వాలి.
- ప్రాథమిక ఆంక్షల రద్దు: ఇరాన్‌పై ఉన్న అన్ని ప్రధాన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి.
- ద్వితీయ శ్రేణి ఆంక్షల తొలగింపు: అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డుగా ఉన్న ఆంక్షలు తొలగించాలి.
- ఐక్యరాజ్యసమితి తీర్మానాలు: భద్రతా మండలిలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపాదనలను రద్దు చేయాలి.
- IAEA నిర్ణయాలు: అంతర్జాతీయ అణుశక్తి సంస్థ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉత్తర్వులను పక్కన పెట్టాలి.
- నష్టపరిహారం: ఇంతకాలం జరిగిన నష్టానికి ఇరాన్‌కు పరిహారం చెల్లించాలి.
- సైనిక ఉపసంహరణ: పశ్చిమ ఆసియా ప్రాంతం నుండి అమెరికా సైన్యం వెనుతిరగాలి.
- సర్వత్రా శాంతి: హిజ్బుల్లా వంటి మిత్రపక్షాలపై దాడులతో సహా అన్ని వైపులా యుద్ధం ఆగిపోవాలి.
సంధి కుదిరినా ఆగని క్షిపణులు!
ఒకవైపు సంధి చర్చలు జరుగుతుంటే, మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపిస్తోంది. ఈ దాడులను అడ్డుకోవడానికి తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని టెల్ అవీవ్ తెలిపింది. అటు యూఏఈ లోని అమెరికా స్థావరాల పైనా ఇరాన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం. అమెరికా మాత్రం ప్రస్తుతానికి ఇరాన్ సరిహద్దుల లోపల దాడులను నిలిపివేసింది.
