ట్రంప్ ప్రాణాపాయంలో ఉన్నారా? హాస్పిటల్‌లో రహస్య చికిత్స? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై వైట్ హౌస్ రియాక్షన్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఆయన రహస్యంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై వైట్ హౌస్ వర్గాలు తాజాగా కీలక వివరణ ఇచ్చాయి.

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన ఈ పోరులో ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా దాడులు చేస్తోంది. ఈ యుద్ధ గమనాన్ని ట్రంప్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు.

అసలేం జరిగింది? పుకార్లు ఎందుకు వచ్చాయి?
గత కొద్ది రోజులుగా ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన ప్రాణాలు కోల్పోయారని కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనికి ప్రధాన కారణం ట్రంప్ తన దైనందిన శైలిని మార్చుకోవడమే. సాధారణంగా ప్రతి వారాంతంలో తన ‘మార్-ఎ-లాగో’ విల్లాలో గోల్ఫ్ ఆడే ట్రంప్, ఈ వారం మాత్రం అలా చేయలేదు. దీనికి తోడు ఆయన నీరసంగా ఉన్న పాత వీడియో ఒకటి నెట్‌లో ప్రత్యక్షం కావడంతో ఈ పుకార్లకు రెక్కలు వచ్చాయి. వాల్టర్ రీడ్ మిలిటరీ హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారనే వార్తలు జోరందుకున్నాయి.

వైట్ హౌస్ వివరణ: “దేవుడు ఆయనను ఆశీర్వదించుగాక”
ఈ వివాదానికి తెరదించుతూ వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ స్పందించారు. “అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ప్రజల కోసం అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆయనలాంటి కష్టజీవిని మీరు చూడలేరు. ఈ ఈస్టర్ వారాంతంలో ఆయన వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో విరామం లేకుండా పనిచేశారు. దేవుడు ఆయనను ఆశీర్వదించుగాక” అని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు.

79 ఏళ్ల వయసు.. చర్చనీయాంశమైన ఆరోగ్యం
గతేడాది రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యంపై తరచూ చర్చ జరుగుతూనే ఉంది. ప్రసంగించేటప్పుడు మాట తడబడటం, విమానం మెట్లు ఎక్కేటప్పుడు తూలడం వంటి సంఘటనలు ఆయన శారీరక దృఢత్వంపై అనుమానాలు కలిగిస్తున్నాయి.

భారతదేశంలో 80, 85 ఏళ్లు దాటిన వారు కూడా పదవుల్లో ఉంటున్నప్పుడు, అమెరికాలో ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? అనే ప్రశ్న రావచ్చు. కానీ, ప్రపంచ అగ్రరాజ్యాన్ని నడిపించే వ్యక్తి శారీరకంగా, మానసికగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అమెరికా ప్రజలు బలంగా కోరుకుంటారు. అందుకే అధ్యక్షుడి హెల్త్ రిపోర్ట్ అక్కడ ఎప్పుడూ హాట్ టాపిక్.


Posted

in

by

Tags: