ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న తరుణంలో, ఆయుధాలతో కూడిన రెండు అమెరికా యుద్ధ విమానాలు తమ దేశంలో ల్యాండింగ్ కావడానికి శ్రీలంక అనుమతి నిరాకరించింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే అమెరికా అభ్యర్థనను తోసిపుచ్చడం ఆ దేశానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.
అసలేం జరిగింది? ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం మూడు వారాలు దాటింది. ఇరాన్ తన పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈలలో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా తన మిత్రదేశాల విమానశ్రయాలను వాడుకుని ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఇదే పంథాలో, తూర్పు ఆఫ్రికాలోని జిబూటి (Djibouti) నుండి బయలుదేరిన రెండు అమెరికా యుద్ధ విమానాలను శ్రీలంకలోని మత్తల అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడానికి అమెరికా అనుమతి కోరింది.
శ్రీలంక నిరాకరణకు కారణం: శ్రీలంక పార్లమెంటులో అధ్యక్షుడు దిస్సానాయకే మాట్లాడుతూ.. “మార్చి 4 మరియు మార్చి 8 తేదీల్లో అమెరికా ఈ విజ్ఞప్తి చేసింది. ఆ విమానాల్లో 8 యాంటీ-షిప్ మిసైళ్లు ఉన్నాయి. సముద్రంలో ఉన్న ఇరాన్ యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ ఆయుధాలను తీసుకువచ్చారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, యుద్ధ విషయంలో మేము తటస్థంగా (Neutral) ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే అనుమతి నిరాకరించాం” అని స్పష్టం చేశారు.
నేపథ్యం: ఈ నెల ప్రారంభంలో శ్రీలంక సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌక ‘IRIS Dena’ను అమెరికా జలాంతర్గామి ముంచేసింది. ఈ ఘటనలో 84 మంది మరణించగా, 32 మందిని శ్రీలంక నౌకాదళం రక్షించింది. ప్రస్తుతం 219 మంది సైనికులతో కూడిన మరో ఇరాన్ నౌక ‘IRINS Bushehr’కు శ్రీలంక తన తూర్పు తీరంలోని త్రికోణమలైలో రక్షణ కల్పించింది. ఇరాన్ నౌకలపై దాడులు చేయడానికి అమెరికా ప్లాన్ చేస్తోందని గ్రహించిన లంక ప్రభుత్వం, వారి యుద్ధ విమానాలకు చోటు ఇవ్వలేదు.
