టెహ్రాన్: అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మరియు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు కార్గో నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.
ఈ దాడుల్లో సదరు కార్గో నౌకలు ధ్వంసమయ్యాయి. దీనితో హార్ముజ్ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం తాత్కాలిక ఒప్పందం ఆధారంగా నిలిచిపోయింది. దీనితో ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరిచింది. అయినప్పటికీ, ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడి చేసింది.
దీనితో ఆగ్రహించిన అమెరికా, ఇరాన్‌పై తిరిగి క్షిపణి దాడులను ప్రారంభించింది. ప్రతిగా ఇరాన్ కూడా ఖతార్‌తో సహా ఇతర దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఆ ఘర్షణలు సద్దుమణిగిన సమయంలోనే ఇప్పుడు కొత్త సమస్య తలెత్తింది.
నిన్న హార్ముజ్ జలసంధి గుండా రెండు కార్గో నౌకలు వెళ్తుండగా, వాటిపై దాడులు జరిగాయి. ఈ దాడులను ఇరాన్ స్వయంగా నిర్వహించిందని సమాచారం. ఇరాన్‌లోని రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఈ దాడులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మొత్తం రెండు క్షిపణులు విడివిడిగా ఆ నౌకలను తాకాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు, కానీ నౌకలు దెబ్బతిన్నాయి.
ఈ ఘటన మళ్ళీ ఉద్రిక్తతలకు దారితీసింది. హార్ముజ్ జలసంధిలో దాడులు చేయడం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికా ఇదివరకే హెచ్చరించిన నేపథ్యంలో, ప్రస్తుతం జరిగిన ఈ ‘అటాక్’తో సమస్య మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది.
అయితే, ప్రస్తుతం ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. జూలై 9 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ సమయంలో తాము దాడులు చేయబోమని అమెరికా ప్రకటించడం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. అయినప్పటికీ, అమెరికా తన వైఖరిని ఎప్పుడు మార్చుకుంటుందో తెలియక ఆ ప్రాంతంలో అనిశ్చితి, ఉద్రిక్త వాతావరణమే కొనసాగుతోంది.
