మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వడెట్టివార్ శనివారం రాత్రి అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద జరిగిన ఈ కాల్పులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా వచ్చిన “ప్రజా స్పందన”గా ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా, ప్రస్తుతం భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో అచ్చం ఇలాంటి భావజాలమే ఉందని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
ఆదివారం నాగ్‌పూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వడెట్టివార్ మాట్లాడుతూ.. పశ్చిమ ఆసియా వివాదాల్లోకి అమెరికాను లాగి, ఆ దేశాన్ని ట్రంప్ “నాశనం” చేశారని ఆరోపించారు. భారత ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని, అయితే వారు నిరసన తెలపడానికి వీధుల్లోకి రావడం లేదని ఆయన పేర్కొన్నారు.
వడెట్టివార్ వ్యాఖ్యల సారాంశం: “చేసిన పాపం కాశీకి వెళ్ళినా వదలదు అన్నట్లు.. ఎవరు చేసిన దానికి వారే అనుభవించాలి. అత్యున్నత పదవిలో ఉండి ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని ట్రంప్ ప్రయత్నించారు. ప్రతి దేశాన్ని ఇబ్బందులకు గురిచేశారు. ప్రపంచమంతా తన బానిస అన్నట్లుగా వ్యవహరించారు. ఇరాన్‌తో సంబంధం లేకపోయినా, ఇజ్రాయెల్‌తో కలిసి చేసిన దాడుల ఫలితమే ఇది. తన కోరికల కోసం అమెరికాను సర్వనాశనం చేశారు.”
“మన దేశంలో ఏం జరుగుతుందో, అక్కడ కూడా అదే జరిగింది. అక్కడ ప్రజలు వ్యతిరేకతతో రోడ్లపైకి వచ్చారు. మన దేశంలో జనం వీధుల్లోకి రావడం లేదు కాబట్టి అంతా బాగుందని ప్రభుత్వం అనుకుంటోంది. కానీ, భారతదేశం కూడా వినాశనం వైపు పయనిస్తోందనే ఆవేదన ఇక్కడి ప్రజల్లో కూడా ఉంది” అని వడెట్టివార్ జోడించారు.
అయితే, ఒక దేశ అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తిపై హింసాత్మక చర్యలు జరగడం సరైంది కాదని కూడా ఆయన పేర్కొన్నారు. “ట్రంప్‌కు జరిగినది ఒక అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి జరగకూడదు. కానీ ఒక వ్యక్తి చేసే పనులకే ప్రజలు ఇచ్చే సమాధానమే ఈ ఘటనలో కనిపిస్తోంది” అని ఆయన విలేకరులతో అన్నారు.
వైట్ హౌస్ డిన్నర్ కాల్పుల నేపథ్యం: వాషింగ్టన్ డిసిలో శనివారం సాయంత్రం జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వద్ద 31 ఏళ్ల కోల్ టోమస్ అలెన్ అనే వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని కాల్పులు జరిపాడు. భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకునే లోపే ఒక అధికారికి గాయాలయ్యాయి. ఈ ఘటన సమయంలో ప్రెసిడెంట్ ట్రంప్, మెలానియా ట్రంప్ మరియు వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్‌లను సురక్షితంగా అక్కడి నుండి తరలించారు.
