ఆసుపత్రుల్లో గంటల తరబడి క్యూలో నిలబడకుండా ఆన్లైన్లో సులభంగా అపాయింట్మెంట్ బుక్ చేసుకునే విధానాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. హాస్పిటల్ అపాయింట్మెంట్ పేరుతో నకిలీ మొబైల్ యాప్లను ఉపయోగించి UPI వినియోగదారుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేరళ పోలీసులు ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు.
ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రుల పేర్లతో నకిలీ మొబైల్ యాప్లను రూపొందించి.. వాటి ద్వారా అమాయక రోగులు, వారి కుటుంబ సభ్యులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు.
సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, సెర్చ్ ఇంజిన్ ప్రకటనల ద్వారా నకిలీ లింకులను ప్రచారం చేసి.. వాటి నుంచి ఈ యాప్లను డౌన్లోడ్ చేసుకునేలా చేస్తున్నారు.
యాప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత.. “హాస్పిటల్ అపాయింట్మెంట్ కోసం కేవలం రూ.5 లేదా రూ.10 మాత్రమే చెల్లించండి” అంటూ నమ్మిస్తున్నారు.
ఆ తర్వాత వినియోగదారులు తమ UPI లేదా నెట్ బ్యాంకింగ్ వివరాలను నమోదు చేసిన వెంటనే.. ఫోన్లోని కీలక సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అనంతరం బ్యాంకింగ్ సంబంధిత రహస్య కోడ్లు లేదా ఇతర ధృవీకరణ వివరాలను మోసపూరితంగా పొందితే.. ఖాతాలోని డబ్బును కాజేసే ప్రమాదం ఉంది.
ఈ తరహా మోసాల నుంచి బయటపడేందుకు Google Play Store లేదా Apple App Store వంటి అధికారిక యాప్ స్టోర్లను మాత్రమే ఉపయోగించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. గుర్తుతెలియని లింకుల ద్వారా ఎలాంటి యాప్లను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
హాస్పిటల్ అపాయింట్మెంట్ కోసం సంబంధిత ఆసుపత్రుల అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక యాప్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద చెల్లింపు లింకులు లేదా విచిత్రమైన పేమెంట్ రిక్వెస్ట్లు వస్తే వాటిని వెంటనే తిరస్కరించాలని తెలిపారు.
ఒకవేళ ఇలాంటి నకిలీ యాప్లు లేదా సైబర్ మోసాల కారణంగా డబ్బు పోగొట్టుకున్నట్లయితే.. ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
ఒక్క చిన్న క్లిక్.. భారీ నష్టానికి దారితీయొచ్చు. కాబట్టి హాస్పిటల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకునే ముందు యాప్, లింక్ నిజమైనదేనా కాదా తప్పనిసరిగా చెక్ చేసుకోండి.

Leave a Reply