మురైనా డిప్యూటీ కలెక్టర్ అరవింద్ మాహౌర్ ఒక యువతిపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో బీపీ పెరగడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు, అక్కడి నుండి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపారు.
అసలేం జరిగింది? వివాహం చేసుకుంటానని నమ్మించి, యువతిని కారులో, తన ఫ్లాట్‌లో మరియు ప్రభుత్వ రెస్ట్ హౌస్‌లో లైంగికంగా వేధించినట్లు అరవింద్ మాహౌర్పై ఆరోపణలు ఉన్నాయి. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరి మధ్య మాటలు పెరిగి, పెళ్లి చేసుకుంటానని అరవింద్ యువతికి హామీ ఇచ్చారు. పెళ్లికి అంగీకరించిన తర్వాత, ‘ఇక మన పెళ్లి ఖాయమే కదా’ అని నమ్మించి, శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేశారు.
4 నెలల పాటు సాగిన దారుణం: బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, మార్చి 30, 2025 నుండి జూన్ 3, 2026 వరకు దాదాపు 14 నెలల పాటు ఈ వేధింపులు కొనసాగాయి. తనను కారులో ఎక్కించుకుని రెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లడం, సబల్ఘఢ్లోని ప్రభుత్వ నివాసానికి, గ్వాలియర్‌లోని ప్రైవేట్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి మరీ ఆమె అంగీకారం లేకుండా శారీరక సంబంధం పెట్టుకున్నారని యువతి తెలిపింది.
పెళ్లి అడిగితే బెదిరింపులు: యువతి పెళ్లి గురించి నిలదీసినప్పుడు, అరవింద్ మాహౌర్ పెళ్లికి నిరాకరించడమే కాకుండా, ఆమె కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారు. ఈ కేసులో మరో మహిళా స్నేహితురాలి పేరును కూడా బాధితురాలు పేర్కొంది. ఫిర్యాదు చేయకుండా రాజీ పడాలని, లేదంటే చంపేస్తానని ఆ మహిళ కూడా తనను బెదిరించిందని బాధితురాలు ఆరోపించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని అరవింద్ మాహౌర్ కొట్టిపారేస్తున్నారు.
