తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వచ్చే ఎన్నికల కోసం 164 స్థానాల్లో డీఎంకే నేరుగా పోటీ చేస్తుందని ప్రకటిస్తూ, ప్రజలను ఆకట్టుకునేలా భారీ హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. దీనిని ‘ఎన్నికల కథానాయకుడు’గా అభివర్ణిస్తున్నారు.
ప్రధాన వాగ్దానాలు:
- మహిళా సాధికారత: ‘మహిళా గౌరవ వేతనం’ (Magalir Urimai Thogai) నెలకు ₹1000 నుండి ₹2000 కి పెంపు.
- ఇల్లాలి కూపన్ (Illatharasi Coupon): ఆదాయపు పన్ను చెల్లించని కుటుంబాల మహిళలకు వాషింగ్ మెషీన్, టీవీ, ఫ్రిజ్, మిక్సీ వంటి గృహోపకరణాలు కొనడానికి లేదా పాతవి మార్చుకోవడానికి ₹8 విలువైన ప్రత్యేక కూపన్లు.
- విద్యార్థులకు ల్యాప్టాప్లు: ఉన్నత విద్య చదువుతున్న 35 లక్షల మంది విద్యార్థులకు ఐదేళ్లలో ల్యాప్టాప్ల పంపిణీ.
- ఉచిత విద్యుత్: 20 లక్షల మంది రైతులకు ఎటువంటి మీటర్లు లేని ఉచిత పంప్సెట్ల పంపిణీ.
- వైద్యం: ముఖ్యమంత్రి బీమా పథకం పరిమితిని ₹10 లక్షలకు పెంపు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ యంత్రాల సంఖ్య రెట్టింపు.
- ఉద్యోగ అవకాశాలు: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.5 లక్షల పోస్టుల భర్తీ. 2030 నాటికి ప్రతి జిల్లాలో ‘నియో టైడల్ పార్కులు’ ఏర్పాటు ద్వారా 2 లక్షల కొత్త ఉద్యోగాలు.
- రైతులకు గిట్టుబాటు ధర: క్వింటాల్ వరికి ₹3,500, టన్ను చెరకుకు ₹4,500 చెల్లింపు.
- నివాసం: రాబోయే ఐదేళ్లలో 10 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం.
- పెన్షన్ పెంపు: వృద్ధాప్య పింఛను ₹1200 నుండి ₹2000 కి, దివ్యాంగుల పింఛను ₹1500 నుండి ₹2500 కి పెంపు.
- బస్సుల సౌకర్యం: వచ్చే ఐదేళ్లలో 10,000 కొత్త బస్సుల ప్రారంభం.
