ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్రాంపూర్లోని ‘డివైన్ పబ్లిక్ స్కూల్’లో యథావిధిగా తరగతులు జరుగుతుండగా అనూహ్యంగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పాఠశాల సమయంలో, స్కూల్ ప్రాంగణం పక్కనుంచి ఒక ఆధ్యాత్మిక ఊరేగింపు వెళ్తోంది. ఆ ఊరేగింపులో ఉన్న డీజే వాహనం నుంచి అత్యంత భారీ శబ్దంతో పాటలు వేశారు. ఆ శబ్దం విని తరగతి గదిలోని పిల్లలంతా ఆసక్తిగా కిటికీలోంచి బయటకు చూస్తున్నారు.
తరగతి గదిలో ఉన్న ఆ 2వ తరగతి చిన్నారి మొదట తన స్నేహితురాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూనే ఉంది. కానీ, కొద్ది నిమిషాల్లోనే అనూహ్యంగా స్పృహతప్పి పడిపోయింది. ఇది గమనించిన వెనుక ఉన్న విద్యార్థిని ఆమె తలను పైకి ఎత్తగా, కొద్దిసేపటికి ఆ చిన్నారి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఆ తర్వాత, ఉపాధ్యాయురాలు వేరే వరుసలో ఉన్న విద్యార్థులను గమనిస్తున్న సమయంలో, ఆ బాలిక మళ్లీ డెస్క్‌పై తలవాల్చి, సీట్లోనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది.
ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. “డీజే వాహనం నుంచి వచ్చిన భారీ శబ్దం, దాని ప్రకంపనల వల్లే మా బిడ్డకు తీవ్ర ఒత్తిడి కలిగి గుండెపోటు వచ్చింది” అని కన్నీరుమున్నీరవుతూ ఆరోపించారు. అయితే, వారి ఆరోపణలకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక వైద్యపరమైన ఆధారాలు నిర్ధారించబడలేదు. పాఠశాల నిర్వాహకుడు ఆశిష్ ఉపాధ్యాయ ఈ ఘటనను ధృవీకరించగా, తరగతి గదిలో అసలేం జరిగింది, బాలిక మృతికి కచ్చితమైన కారణం ఏమిటనే దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply