డెంగ్యూ జ్వరం సోకగానే చాలామంది మొదట గమనించేది రక్తంలోని ప్లేట్లెట్స్ (Platelets) సంఖ్యను మాత్రమే.
అయితే డెంగ్యూ ఇన్ఫెక్షన్ కొన్ని సందర్భాల్లో శరీరంలోని ఇతర అవయవాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అరుదైన పరిస్థితుల్లో మెదడు మరియు నాడీ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నందున, జ్వరంతో పాటు కనిపించే అసాధారణ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా కొందరిలో మెదడు మరియు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మెదడు వాపు (ఎన్సెఫలైటిస్) వంటి సమస్యలు అరుదుగా తలెత్తుతుంటాయి. అంతేకాకుండా తీవ్రమైన డెంగ్యూ స్థితిలో శరీరంలో జరిగే అంతర్గత రక్తస్రావం లేదా రక్తం గడ్డకట్టే ప్రక్రియలో వచ్చే మార్పులు కూడా న్యూరో సమస్యలకు దారితీయవచ్చు.
అందుకే డెంగ్యూ రోగి ఆరోగ్యాన్ని కేవలం ప్లేట్లెట్ల సంఖ్యను బట్టి మాత్రమే అంచనా వేయడం సరికాదు. తీవ్రమైన తలనొప్పి, ఆగకుండా వాంతులు కావడం, మైకం, గందరగోళానికి గురికావడం, ఫిట్స్ (మూర్ఛ), మాట్లాడటంలో ఇబ్బంది లేదా కాళ్లు, చేతుల్లో అకస్మాత్తుగా బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ముఖ్యంగా ఒక చేయి లేదా కాలు చచ్చుబడిపోవడం, ముఖం ఒకవైపునకు వంకరపోవడం, మాట తడబడటం వంటివి పక్షవాతం (స్ట్రోక్) లక్షణాలు కావొచ్చు.
అయితే డెంగ్యూ వచ్చిన ప్రతి ఒక్కరికీ పక్షవాతం వస్తుందని భయపడాల్సిన పనిలేదు; డెంగ్యూ వల్ల మెదడు, నాడీ సమస్యలు రావడం చాలా అరుదు. కాబట్టి అనవసర ఆందోళన చెందకుండా, వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. డెంగ్యూ బారిన పడినప్పుడు శరీరంలో కనిపించే తీవ్ర మార్పులను గమనిస్తూ, ప్రమాదకర లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లడం ఎంతో శ్రేయస్కరం.

Leave a Reply