సమాజంలో మనం తరచుగా వింటూ ఉంటాం.. అమ్మాయిలు పెళ్లి తర్వాత అత్తగారింటికి వెళ్తారు కాబట్టి, పుట్టింటి (తండ్రి) ఆస్తిపై వారికి ఎలాంటి హక్కు ఉండదని. ఇదే ఆలోచనా ధోరణి వల్ల తండ్రి ఆస్తిపై కేవలం కుమారులకే అధికారం ఉంటుందని చాలామంది నమ్ముతారు.
కానీ అసలు చట్టం ఏం చెబుతోంది? కుమార్తెలకు చట్టపరంగా ఎంతవరకు హక్కులు కల్పించబడ్డాయి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
కుమార్తెలకు సమాన హక్కులు: గతంలో దీనికి సంబంధించిన నిబంధనలు వేరుగా ఉండేవి. 1956 నాటి ‘హిందూ వారసత్వ చట్టం’ ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిపై హక్కులు ఉండేవి కావు. దీనివల్ల ఆస్తి హక్కుల్లో కుమారులకు, కుమార్తెలకు మధ్య దశాబ్దాల పాటు వివక్ష కొనసాగింది. అయితే, 2005లో ఈ చట్టానికి ఒక కీలక సవరణ చేశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం, తండ్రి ఆస్తిలో కుమార్తెలకు కుమారులతో సమానమైన హక్కులను కల్పించారు. ఇప్పుడు కుమార్తెలు కూడా కుమారుల మాదిరిగానే ఆస్తిలో ‘సమాన వాటాదారులు’ (Co-parceners) గా పరిగణించబడతారు.
ఈ సందర్భాలలో ఆస్తి హక్కు వర్తించదు:
- మరణశాసనం (Will) ఉంటే: ఒకవేళ తండ్రి తాను స్వయంగా సంపాదించిన ఆస్తికి (Self-acquired property) సంబంధించి ఎవరికైనా వీలునామా రాస్తే, దాని ప్రకారమే ఆస్తి పంపకం జరుగుతుంది. తండ్రి తన వీలునామాలో ఆస్తి మొత్తాన్ని కుమారుడికే రాసిస్తే, కుమార్తె ఆ ఆస్తిపై ఎలాంటి దావా వేయలేరు. ఒకవేళ వీలునామా లేకపోతే మాత్రం, చట్టప్రకారం కుమార్తె కూడా సమాన వారసురాలు అవుతుంది.
- సెప్టెంబర్ 9, 2005 కంటే ముందే పంపకాలు జరిగితే: ఒకవేళ తండ్రి సెప్టెంబర్ 9, 2005 కంటే ముందే మరణించి, ఆస్తి పంపకాలు అప్పటికే పూర్తయి ఉంటే, కుమార్తె ఆ ఆస్తిపై మళ్లీ దావా వేయడానికి అవకాశం ఉండదు.
- తండ్రి సొంత సంపాదన: తండ్రి తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిపై ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆ ఆస్తిని తన ఇష్టప్రకారం ఎవరికైనా ఇచ్చే హక్కు తండ్రికి ఉంటుంది.
సుప్రీంకోర్టు స్పష్టత: 2005 సవరణ తర్వాత కుమార్తెల ఆస్తి హక్కులు మరింత బలపడ్డాయి. కుమార్తెకు ఈ హక్కు పుట్టుకతోనే లభిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిలో (Ancestral property) కుమార్తెకు కుమారుడితో సమానమైన వాటా ఉంటుంది. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కుమార్తె వివాహం జరిగిందా లేదా అన్నదానితో సంబంధం లేదు. ఆమె పెళ్లయిన మహిళ అయినా, వితంతువు అయినా లేదా విడాకులు తీసుకున్న వారైనా తండ్రి ఆస్తిపై సమాన హక్కు కలిగి ఉంటారు.
