పెట్టుబడుల విషయానికి వస్తే, ప్రతి సీజన్లో ఒక్కో రకమైన పెట్టుబడి మంచి లాభాలను ఇస్తుంది. కొన్ని సంవత్సరాలు స్టాక్ మార్కెట్, మరికొన్ని రోజులు డెట్ ఫండ్స్, ఇంకొన్నిసార్లు బంగారం లాభాలను అందిస్తాయి. అలా గత కొన్ని ఏళ్లుగా లాభాల పంట పండించిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో స్మార్ట్‌గా పెట్టుబడి పెట్టడానికి మనం ఏం చేయాలో తెలుసుకుందాం.
కరోనా తర్వాత బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. గత నాలుగు ఏళ్లలో పెట్టుబడిదారులకు బంగారం అద్భుతమైన రాబడిని ఇచ్చింది. అందుకే సామాన్యులు కూడా బంగారం వైపు పరుగులు తీశారు.
బంగారం ధరల పరిస్థితి: అంతర్జాతీయ మార్కెట్లో 2022 చివరలో ఒక ఔన్స్ బంగారం సుమారు 1,620 డాలర్లుగా ఉండేది. గత కొన్ని నెలల క్రితం ఇది గరిష్టంగా 5,595 డాలర్ల వరకు పెరిగింది. మన దేశంలో కూడా 24 క్యారెట్ల బంగారం ధర 4 ఏళ్ల క్రితం గ్రాము రూ. 5,000–5,200గా ఉండగా, అది ఇప్పుడు రూ. 17 వేల వరకు వెళ్లింది. రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం.
ప్రస్తుతం బంగారం ధర స్వల్పంగా తగ్గి, 24 క్యారెట్ల బంగారం గ్రాము సుమారు రూ. 14,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు మరికొంత బంగారం కొనుగోలు చేయాలా? లేక చేతిలో ఉన్న బంగారాన్ని అమ్మేసి లాభాలు పొందాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఏం చేయాలి? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే, “బంగారం ధర తగ్గింది కదా అని వెంటనే అమ్మేయడం లేదా పెరిగింది కదా అని మరికొంత కొనడం వంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా ఎంత ఉందో విశ్లేషించుకుని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు, మీ పోర్ట్‌ఫోలియోలో 10 శాతం మాత్రమే బంగారం ఉండాలని మీరు భావించవచ్చు. కానీ ధరల పెరుగుదల వల్ల అది 20 శాతానికి చేరితే, కొంత భాగాన్ని అమ్మేసి లాభాలను స్వీకరించి, తిరిగి 10 శాతానికి సర్దుబాటు చేయడం సరైన పద్ధతి. ఎందుకంటే బంగారం అనేది ఎక్కువ లాభాలు ఇచ్చే పెట్టుబడి కాదు, ఆర్థిక సంక్షోభ సమయంలో మీ సంపదను రక్షించే ఒక ఆస్తి మాత్రమే.”
బంగారం ధరల సరళి: గతంలో బంగారం ధరల గమనాన్ని గమనిస్తే, అది ఎప్పుడూ ఒకే దిశలో పెరగలేదు. 2011, 2020 తర్వాత బంగారం గణనీయమైన పతనాన్ని చూసింది. ప్రస్తుతం రూ. 1.72 లక్షల గరిష్టం నుండి రూ. 1.41 లక్షలకు అంటే దాదాపు 18 శాతం తగ్గింది. రాబోయే 12 నుండి 18 నెలల వరకు ధరలు పెద్దగా పెరిగే అవకాశం లేదు, ఇదే రేంజ్లో ఉండవచ్చు లేదా ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది.
పెట్టుబడిదారులకు సలహా ఏంటంటే.. మీకు ఎక్కువ లాభాలు కావాలి, రిస్క్ భరించగలరు అనుకుంటే మొత్తం పెట్టుబడిలో 5 నుండి 10 శాతం మాత్రమే బంగారం ఉంచుకోండి. సురక్షితమైన పెట్టుబడి కోరుకునే వారు 10 నుండి 15 శాతం వరకు ఉంచుకోవచ్చు. అంతకు మించి బంగారంపై పెట్టుబడి పెట్టడం మీ ఇతర లాభాలపై ప్రభావం చూపవచ్చు.
ఎలా పెట్టుబడి పెట్టాలి? బంగారంలో పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నేరుగా దుకాణానికి వెళ్లి కొనుగోలు చేయడాన్ని చాలా మంది ఇష్టపడతారు, ఇది మంచిదే. కానీ ఇందులో మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటి సమస్యలు ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs) ఉత్తమ ఎంపికగా పరిగణించబడతాయి. వీటిని సులభంగా కొనవచ్చు, అమ్మవచ్చు మరియు భద్రంగా ఉంటాయి. డిజిటల్ గోల్డ్ విషయానికి వస్తే, అది సెబీ (SEBI) లేదా ఆర్బీఐ పరిధిలోకి రాదు కాబట్టి కొంత రిస్క్ ఉంటుంది.
దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఎక్కువ సంపదను సృష్టిస్తాయి. అయితే, ద్రవ్యోల్బణం, యుద్ధాలు, కరెన్సీ విలువ పతనం వంటి అనిశ్చిత సమయాల్లో బంగారం మంచి రక్షణగా నిలుస్తుంది.
