మహారాష్ట్రలోని దివా ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను పిచ్చి కుక్క కరిచింది. నెల రోజులుగా మృత్యువుతో పోరాడిన నిషా షిండే (5) చివరకు ఆదివారం చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
అసలేం జరిగింది? నవంబర్ 17న నిషా తన ఇంటి ముందు ఆడుకుంటూ ఒక గోడపై కూర్చున్నప్పుడు, ఒక పిచ్చి కుక్క ఆమె భుజంపై బలంగా కరిచింది. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు వెంటనే ఆమెను కల్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. డిసెంబర్ 17న నాలుగో డోస్ ఇచ్చేందుకు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పుట్టినరోజు తర్వాత క్షీణించిన ఆరోగ్యం: డిసెంబర్ 3న నిషా పుట్టినరోజు వేడుకలు జరిగాయి, అప్పటి వరకు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే, డిసెంబర్ 16న చివరి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆమెలో రేబిస్ లక్షణాలు స్పష్టంగా కనిపించసాగాయి. ఆమె భయంకరంగా ప్రవర్తిస్తూ, తన శరీర భాగాన్నే తనే కరుచుకోవడం ప్రారంభించింది. పరిస్థితి విషమించడంతో ఆమెను ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ నాలుగు రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ, నిషా ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరకు డిసెంబర్ 21న ఆ చిన్నారి మరణించింది. సరైన సమయంలో నాణ్యమైన చికిత్స అందకపోవడం వల్లే తన మేనకోడలు చనిపోయిందని నిషా మామ సమాధాన్ కదమ్ ఆరోపించారు.
