బీహార్‌లోని నలంద జిల్లాలో మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన ఎక్సైజ్ కానిస్టేబుల్ అజిత్ కుమార్ తుపాకీ గుండు తగిలి మరణించిన ఘటనలో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
మొదట మద్యం స్మగ్లర్లు లేదా వారికి సమాచారం అందించే వ్యక్తులు జరిపిన కాల్పుల్లోనే ఆ కానిస్టేబుల్ మరణించాడని చెప్పినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. తనిఖీ బృందంలో ఉన్న హోంగార్డు జరిపిన కాల్పుల వల్లే అజిత్ కుమార్ మరణించాడని పోలీసులు వెల్లడించారు.
నలంద జిల్లా పావాపురి ప్రాంతంలో, అక్రమ మద్యాన్ని తరలిస్తున్న స్కార్పియో వాహనాన్ని పట్టుకునేందుకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది తనిఖీలకు వెళ్లారు. ఆ సమయంలో తుపాకీ గుండు తగలడంతో కానిస్టేబుల్ అజిత్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. కాల్పులకు సంబంధించిన అంశాలు, ఘటన అనంతరం ఇచ్చిన వివరణలను క్షుణ్ణంగా పరిశీలించగా, ప్రాథమికంగా చెప్పిన వివరాలకు మరియు లభించిన ఆధారాలకు మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఘటనపై నలంద జిల్లా ఎస్పీ హృదయకాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం… ఆధారాలను తొక్కిపెట్టి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు ఎక్సైజ్ శాఖ మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ పుష్ప, కానిస్టేబుల్ అనూప్, ఇద్దరు హోంగార్డులు మరియు ప్రైవేట్ వాహన డ్రైవర్‌తో సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తనిఖీ బృందంలోని హోంగార్డు తుపాకీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ తగలడం వల్లే అజిత్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడని ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు.
స్మగ్లర్లు దాడి చేయడం వల్లే కానిస్టేబుల్ చనిపోయాడని మొదట ప్రచారం జరిగినప్పటికీ, పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి రావడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. కానిస్టేబుల్ మృతికి దారితీసిన కాల్పులు ప్రమాదవశాత్తు జరిగాయా లేదా ఇంకేదైనా కారణం ఉందా, ఘటన తర్వాత నిజాన్ని ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అరెస్ట్ అయిన ఐదుగురి పాత్రపై మరిన్ని వివరాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడి కానున్నాయి.

Leave a Reply