చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన కూటములతో పాటు బీజేపీని కూడా నిష్ప్రభం చేస్తూ TVK అసెంబ్లీలోకి ఘనంగా అడుగుపెట్టింది. 234 నియోజకవర్గాలున్న తమిళనాడులో 109 సీట్లు గెలుచుకుని విజయ్ పార్టీ అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించింది.
స్టాలిన్ మరియు బీజేపీ ప్రముఖులకు భారీ షాక్
రాజకీయ దిగ్గజం, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఊహించని ఓటమిని చవిచూశారు. కొలత్తూరు నియోజకవర్గంలో TVK అభ్యర్థి బాబు చేతిలో 9 వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో స్టాలిన్ ఓడిపోయారు. స్టాలిన్ రాజకీయ జీవితంలో ఇది నాలుగో ఓటమి.
జాతీయ పార్టీ అయిన బీజేపీకి కూడా తమిళ గడ్డపై తీవ్ర పరాభవం ఎదురైంది. గత ఎన్నికల్లో 4 సీట్లు సాధించిన బీజేపీ, ఈసారి కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. ఆ పార్టీ ప్రధాన నేతలు నైనార్ నాగేంద్రన్, ఎల్. మురుగన్, తమిళిసై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్ అందరూ ‘విజయ్ ప్రభంజనం’లో కొట్టుకుపోయారు.
ప్రస్తుత సీట్ల వివరాలు:
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ మార్కు 118 కాగా, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం:
- TVK (విజయ్): 108
- DMK (స్టాలిన్): 59
- AIADMK (ఎడప్పాడి): 47
- కాంగ్రెస్: 5
- PMK: 4
- CPI: 2
- BJP: 1
అనిశ్చితిలో అధికారం; విజయ్‌కు రాహుల్ గాంధీ ఫోన్
అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, మెజారిటీకి విజయ్ పార్టీకి మరో 9 సీట్లు అవసరం. ఏఐఏడీఎంకే (AIADMK) విజయ్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కౌంటింగ్ సమయంలోనే స్పష్టం చేసింది. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం.
తమిళనాడు రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా మారిన విజయ్ ఎవరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? లేదా బయట నుండి మద్దతు తీసుకుంటారా? అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
