తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 నియోజకవర్గాలను కైవసం చేసుకున్నప్పటికీ, టీవీకే (TVK) అధ్యక్షుడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటం ఆయన అనుచరుల్లో తీవ్ర ఆగ్రహాన్ని నింపుతోంది.
తమిళనాడు వ్యాప్తంగా టీవీకే కార్యకర్తలు నిరసనలకు దిగే అవకాశం ఉందని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు (Intelligence) నివేదిక ఇచ్చాయి. నిన్నటి వరకు విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు కేవలం మెజారిటీ మార్కు మాత్రమే సమస్యగా ఉండగా, ఇప్పుడు Horse Trading చేస్తున్నారనే ఆరోపణలు తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి.
రాజకీయ వ్యూహాలు – వివాదాలు
విజయ్ నిన్న రెండుసార్లు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు హక్కును కోరినట్లు సమాచారం. ఆ సమయంలో, తమిళగ వెట్రి కళగం తరపున 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొంటూ ఒక లేఖను కూడా గవర్నర్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ లేఖలో కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), ఐయూఎంఎల్ (1) మరియు ఏఎంఎంకే (1) పార్టీల మద్దతు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, వీరిలో కాంగ్రెస్ మరియు వామపక్షాలు మాత్రమే ఇప్పటివరకు అధికారికంగా మద్దతు ప్రకటించాయి.
మరోవైపు, ఏఎంఎంకే (AMMK) ఎమ్మెల్యే కామరాజ్ ఇచ్చిన మద్దతు లేఖ నకిలీదని టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఆయన కామరాజ్‌తో కలిసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి వివరణ లేఖ ఇవ్వడమే కాకుండా, గిండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. “కుట్రపూరిత మార్గాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గుర్రపు వ్యాపారం జరుగుతోంది” అని దినకరన్ ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే కామరాజ్ మాట్లాడుతూ, “నేను ఎటువంటి మద్దతు లేఖ ఇవ్వలేదు. నేను ఇప్పటికీ ఏఐఏడీఎంకే కూటమిలోనే ఉన్నాను. ఎన్డీయే (NDA) కూటమికే నా మద్దతు కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, కామరాజ్ సంతకం చేసినట్లు టీవీకే విడుదల చేసిన వీడియో కూడా నకిలీదని దినకరన్ మరో బాంబు పేల్చడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటులో మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్న టీవీకే కార్యకర్తలు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ సూచిస్తోంది.
కార్యకర్త ఆత్మహత్యాయత్నం
ఈ పరిణామాల మధ్య, నెల్లై జిల్లా వల్లియూర్ సమీపంలోని పుదుమనై సెట్టికులం ప్రాంతానికి చెందిన విజయ్ వీరాభిమాని, కూలీ కార్మికుడు ఇసక్కియప్పన్.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్నారనే నిరాశలో ఉన్నట్లు సమాచారం. తీవ్ర మానసిక వేదనతో ఉన్న ఇసక్కియప్పన్ ఈరోజు ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. అతని కేకలు విని పరుగున వచ్చిన స్థానికులు అతడిని రక్షించి, చికిత్స నిమిత్తం నాగర్‌కోయిల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కూడంకుళం పోలీసులు ఈ ఘటనపై తీవ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన ఇసక్కియప్పన్ టీవీకేలో వల్లియూర్ యూనియన్ కార్యకర్తల విభాగం జాయింట్ ఆర్గనైజర్‌గా ఉన్నారు. గత నాలుగు నెలల క్రితమే, విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ సుమారు 16 అడుగుల పొడవైన ‘వేల్’ (శూలం)ను బుగ్గలకు గుచ్చుకుని మొక్కులు తీర్చుకున్నాడని, ఆయనకు విజయ్ అంటే అంతటి అమితమైన అభిమానమని స్థానికులు చెబుతున్నారు.
